Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గద్దెలపైకి చేరిన సారలమ్మ
- తన్మయత్వంతో పులకించిన ఆదివాసీలు
- నేడు గుట్ట దిగనున్న సమ్మక్క
- భారీ బందోబస్తు
నవతెలంగాణ-మేడారం ప్రాంతీయ ప్రతినిధి
గిరిజనుల అతిపెద్ద పండుగ మేడారం జాతర భారీ జనసంద్రోహం మధ్యన బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కన్నెపల్లి నుంచి తీసుకొచ్చిన సారలమ్మను బుధవారం రాత్రి 8.20 గంటలకు వడ్డేకాక సారయ్య గద్దెలపై ప్రతిష్టించడంతో మేడారం జనసంద్రంగా మారింది. గురువారం సాయంత్రం సమ్మక్క గుట్ట దిగనుంది. వనదేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుండటంతో మేడారం జాతరకు వెళ్లే పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కన్నెపల్లి యువతులు దేవాలయం చుట్టూ అలుకుచల్లి, ముగ్గులు వేశారు. వడ్డెలు దేవాలయంలో ఆదివాసీ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం 5.45 గంటలకు సారలమ్మను దేవాలయం నుంచి వడ్డే కాక సారయ్య తీసుకుని బయటకు రావడంతో కన్నెపల్లి పూనకాలతో పులకించింది. అడిషనల్ ఎస్పీ మురళీధర్ నేతృత్వంలో భారీ బందోబస్తుతో రోప్ పార్టీని ఏర్పాటు చేసి మేడారం బయలుదేరారు. కన్నెపల్లి దేవాలయం చుట్టూ పునుగుదండాలు పెడుతూ సందర్శకులు మొక్కులు తీర్చుకున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డీసీపీ సాయి చైతన్య, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క), అడిషనల్ ఎస్పీ మురళీధర్ కన్నెపల్లి సారలమ్మ దేవాలయం వద్దకు చేరుకొని పర్యవేక్షించారు. కన్నెపల్లి నుంచి బుధవారం సాయంత్రం 5.00-5.30 గంటలకు బయలుదేరాల్సిన సారలమ్మ రాత్రి 7.20 గంటలకు బయలుదేరింది. దాంతో గద్దెలపైకి సారలమ్మ చేరుకునేటప్పటికి తీవ్ర జాప్యం జరిగింది. మంగళవారమే సమ్మక్క కుమారుడు జంపన్నను గద్దెపైకి చేర్చారు. కాగా, సారలమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ దంపతులు, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిష్టినా జెడ్ చోంగ్టూ, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే డాక్టర్ శ్రీధర్‌బాబు, ఆంధ్రప్రదేశ్ పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు దర్శించుకున్నారు.
చేరిన పగిడిద్దరాజు, గోవిందరాజులు..
ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క కూతురు సారలమ్మతోపాటు సమ్మక్క భర్త పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెలపై ప్రతిష్టించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగొండ్ల గ్రామం నుంచి పగిడిద్దరాజును పెనుక వంశీయులు బుధవారం రాత్రి 8.20 గంటలకు మేడారంలోని గద్దెలపై ప్రతిష్టించారు. పొనుగొండ్ల గ్రామం నుంచి పగిడిద్దరాజును అటవీ మార్గం గుండా 75 కిలోమీటర్ల మేరకు కాలినడకన మేడారం చేర్చారు. మంగళవారం రాత్రి పెనుక వంశీయులు పగిడిద్దరాజు పడిగతో గోవిందరావుపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బస చేసి బుధవారం వేకువజామున మేడారానికి బయలుదేరారు. ఇదే క్రమంలో కన్నాయిగూడెం మండలం కొండాయి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజులను తీసుకొచ్చిన వడ్డెలు బుధవారం సాయంత్రం గద్దెలపై ప్రతిష్టించారు.
నేడు సమ్మక్క రాక
సారలమ్మ గద్దెపైకి చేరడంతో గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను పూజారి కొక్కెర క్రిష్ణయ్య గుట్ట పైనుంచి తీసుకురానున్నారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఎకె 47తో గాలిలోకి కాల్పులు జరిపాక సమ్మక్కను ఆదివాసీ వాయిద్యాలు, డోలు వాయిద్యాల నడుమ కిందకు తీసుకొస్తారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అడిషనల్ ఎస్పీ మురళీధర్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు, రోప్ పార్టీ నడుమ సమ్మక్కను గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. అనంతరం మంత్రులు, కలెక్టర్, ఉన్నతాధికారులు సమ్మక్కకు పూజలు చేస్తారు.