Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పౌర స్పందన వేదిక డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్ (2022-23)లో ప్రధానమైన విద్యావైద్యరంగాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ పౌర స్పందన వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యావైద్య రంగాలకు ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి పథకాలకు అనుగుణంగా పెద్దమొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు. వైద్యరంగంలో మౌలిక వసతులు, సేవలు మరింత మెరుగుపర్చేందుకు అనేక ప్రతిపాదనలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వాటి అమలు, నిర్వహణకు అయ్యే మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లో నిధులు కేటాయించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నుంచి ఏరియా ఆస్పత్రుల దాకా ఉన్న పరికరాల నిర్వహణ, మరమ్మత్తులకు నిధుల కొరత తీవ్రంగాఉందని పేర్కొన్నారు. తెలంగాణ డయాగస్టిక్స్ హబ్‌ల సంఖ్యతోపాటు సేవలను మరింత పెంచాల్సిన అవసరముందని తెలిపారు. విద్యారంగంలో పారిశుధ్య నిర్వహణ, టాయిలెట్లు, తాగునీరు, తరగతి గదుల కొరత, ప్రహరీగోడలు లేకపోవడం వంటి ప్రధాన సమస్యలున్నాయని వివరించారు. మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. డిజిటల్ బోధనకు అనుగుణంగా సాంకేతిక పరికరాలు, విద్యుత్ వసతి ఏర్పర్చాలంటే నిధులను భారీగా కేటాయించాలని కోరారు. ఉపాధ్యాయుల కొరత దృష్ట్యా విద్యావాలంటీర్ల నియామకానికి వీలుగా అదనపు నిధులు కేటాయించాల్సిన అవసరముందని సూచించారు. ప్రస్తుత బడ్జెట్లో మిగిలిన నిధులు వెంటనే విడుదల చేయాలని తెలిపారు.