Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితులకు దక్కని న్యాయం
- అర్హత ఉన్నా ఉద్యోగోన్నతి రాలేదు
- సర్కార్ ఆదేశాలు బేఖాతర్
- కమిషనర్‌ను తప్పుదోవపట్టిస్తున్న పరిపాలన విభాగం
- ఇదీ జీహెచ్ఎంసీ బాగోతం
నవతెలంగాణ- సిటీబ్యూరో
గ్రేటర హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని రోడ్లు, ప్రధాన కూడళ్లు, నగరమంతా శుభ్రంగా ఉందంటే పారిశుధ్య కార్మికుల శ్రమే. వీరిలో అత్యధిక మంది దళితులే. వీరితోపాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోనూ కమాటి, ఆఫీస్ సబార్డినేట్లు సైతం 80శాతానికిపైగా దళితులే ఉన్నారు. అయితే, ప్రమోషన్ల విషయంలో వారికి అన్యాయం జరుగుతోంది. అందుకు ఆఫీస్ సబార్డినేట్ నుంచి రికార్డు అసిస్టెంట్ ఉద్యోగోన్నతులే నిదర్శనం.
సీనియారిటీ ఉన్నా, ప్రొవిజినల్ లిస్టులోని ముందు వరుసులో ఉన్నా, ఇతర అన్ని అర్హతలు ఉన్నా దళితులకు ప్రమోషన్ రాలేదు. ఇతరులకు మాత్రం పైవేవీలేకున్నా ప్రమోషన్స్ ఇచ్చారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య ఇచ్చిన జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ప్రమోషన్లలో అవకతవకలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రమోషన్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను పరిపాలన విభాగం అధికారులు లెక్కచేయకుండా నచ్చినవారికి ఇచ్చేశారు. మరోపక్క కొంత మంది అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్‌ను తప్పుదోవపట్టిస్తున్నారని పలువురు యూనియన్ నేతలు చెబుతున్నారు.
ప్రభుత్వం ఆదేశాలు బేఖాతర్
ప్రసాదరావు కమిటీ ప్రకారం.. బల్దియాలో 200 రికార్డు అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీనియర్ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు కమాటీలు, ఆఫీస్ సబార్డినేట్లు 100 మందికి రికార్డు అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఓ అధికారి చెప్పారు. కానీ, 85పోస్టులే ఖాళీగా ఉన్నాయని చెప్పిన అధికారులు 217మందితో ప్రొవిజినల్ జాబితా తయారు చేసి 76 మందికి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారు. దాంతో ప్రసాదరావు కమిటీ అంటే గౌరవం లేదని, ప్రభుత్వ ఆదేశాలంటే లెక్కలేదని యూనియన్ నేతలు వాపోతున్నారు. దీంతోపాటు సూపరింటెండెంట్, ఏఎంసీ, డీఎంసీ, జేసీ స్థాయి ప్రమోషన్లను ప్రసాదరావు కమిటీ సిఫారసు ప్రకారం చేస్తున్న అధికారులు రికార్డు అసిస్టెంట్ల విషయంలో ఎందుకు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, కమిషనర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఉల్లంఘనలు ఇలా..
రికార్డు అసిస్టెంట్ ప్రమోషన్లలో జీహెచ్ఎంసీ పరిపాలన విభాగం అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు. ప్రమోషన్ ఇవ్వడానికి రెండేండ్ల నిడివి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అర్హులకు ప్రమోషన్లు సైతం ఇచ్చింది. కానీ జీహెచ్ఎంసీలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రొవిజినల్ జాబితాలో 85 నెంబర్లోపు ఉన్నవారికి సగానికిపైగా అర్హులకు ప్రమోషన్ రాలేదు. విచిత్రమేమంటే టాప్10లో ఉన్నవాళ్లకు ప్రమోషన్లు రాలేదు. 2016లో జవాన్లుగా ప్రమోషన్లు పొందిన వాళ్లకు 2020లో రికార్డు అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించారు. దీంతోపాటు 8నెలల కిందట జవాన్‌గా ప్రమోషన్ తీసుకున్నవారు మళ్లీ ప్రస్తుతం రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. కానీ 2016 నుంచి జవాన్‌గా పనిచేస్తున్న దళిత సామాజిక తరగతి వాళ్లకు ఈ సారి కూడా రికార్డు అసిస్టెంట్ ప్రమోషన్ రాలేదు.
- తమకు రికార్డు అసిస్టెంట్ ప్రమోషన్ కావాలని అడిగినవారికి ఇవ్వని అధికారులు అవసరం లేదని రాతపూర్వకంగా రాసిచ్చినవారికీ మాత్రం బలవంతంగా కట్టబెట్టారు. ఈ విషయంపై సదరు అధికారులను ఓ యూనియన్ నేత అడిగితే కమిషనర్ చెబితేనే ఇచ్చామని సమాధానం చెప్పినట్టు తెలిసింది.
- ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు స్టడీ పర్మిషన్ తీసుకుని పై చదువులకు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అనుమతి ఉంటేనే ప్రమోషన్లకు అర్హులు. కానీ అలాంటివారికి సైతం బల్దియా అధికారులు ప్రమోషన్లు ఇచ్చారు.
- ప్రమోషన్ల కోసం తయారు చేసిన ప్రొవిజినల్ లిస్టుపై క్లర్క్, ఏఎంసీ, జేసీ, ఏసీ, కమిషనర్ సంతకాలు చేశారు. కానీ ఫైనల్ లిస్టుపై మాత్రం క్లర్క్, కమిషనర్ సంతకాలతో విడుదల చేశారు. పై విషయాలపై అదనపు కమిషనర్(పరిపాలన)ను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.
విజిలెన్స్ విచారణ జరిపించాలి
జీహెచ్ఎంసీలో ప్రమోషన్ల విషయంలో చాలా అవకతవకలు జరగుతున్నాయి. దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలి. పరిపాలన విభాగంలోని అధికారులు కిందిస్థాయి ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అర్హులైన వారి పేర్లను పక్కకు పెట్టి అనర్హులకు ప్రమోషన్లు ఇచ్చారు. ఈ విషయంపై కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం.
తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్
ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బాలకృష్ణ