Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలుషితమైన నీటితో వంద మంది విద్యార్థులకు అస్వస్థత
- 30మంది ఉపాధ్యాయులకు అనారోగ్యం
- విషయం బైటకి పొక్కకుండా జాగ్రత్తలు
- రంగారెడ్డి జిల్లా మునగనూరు క్యాంపస్‌లో విద్యార్థినుల అవస్థలు
- ఒక్కో హాల్లో వంద మందికి పైగా స్టూడెంట్లు
- ఎస్సీ, ఎస్టీ గురుకులాల పరిస్థితీ అంతే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇరుకిరుకు గదులు.. మంచినీటి సౌకర్యం అంతంతమాత్రమే. బాత్రూంల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే.. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బీసీ గురుకుల పాఠశాల సమస్యలకు నిలయం. అంబర్‌పేట, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ పాఠశాలల విద్యార్థినీలందరికీ ఈ క్యాంపస్సే దిక్కు.
ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 1,500 మందివిద్యార్థినీలకు ఇక్కడే విద్యాభ్యాసం. 50మంది ఉపాధ్యాయులు. 35మంది గెస్ట్ ఫ్యాకల్టీలు.అసౌకర్యాలతో కాలం నెట్టుకొస్తున్న విద్యాలయంలో ఇటీవల 100మంది విద్యార్థులు 30మంది ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారు. కొందరు బాలికలు, ఉపాధ్యాయులు నేటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని యజమాన్యం గోప్యంగా ఉంచటంపై బాలికల తల్లిదండ్రులనుంచి నిరసన వ్యక్తమవుతున్నది. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు..పిల్లలను బడికి పంపించేందుకు జంకుతున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు మాత్రం గురుకులాల గురించి గొప్పగా చెబుతున్నప్పటికీ...అవి సమస్యలకు నిలయాలుగా కూడా ఉన్నాయన్న విషయాన్ని మరుగుపరుస్తున్నారు. ఒకటి రెండు మినహాయిస్తే..రాష్ట్రంలోని గురుకులాల్లో ఎటుచూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. వందల మంది విద్యార్థులను ఇరుకు గదుల్లో ఉంచి చదువు చెప్తున్నారు. చాలా గురుకులాల్లో ఇది తరగతి గది, ఇది వరండా, ఇది వంట శాల అని ప్రత్యేకంగా లేవు. ఓ హాల్ కేటాయించి అందులో పిల్లల్ని ఉంచుతున్నారు. అక్కడే తినుడు.. అక్కడే చదువుడు.. అక్కడే పండుడు అయితున్నది. దాదాపు 75 శాతం గురుకులాలకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లో, ఇరుకిరుకు గదుల్లో వీటిని నడిపిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా బాత్రూంలు లేకపోవడంతో కొన్ని చోట్ల రెండు, మూడు రోజులకోసారి స్నానం చేస్తున్నామని బాలికలు చెబుతున్నారు. ఉన్నా వాటికి తగిన విధంగా తలుపులు లేవు. దీంతో బాలికలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఆ బాత్రూంలను రోజుల తరబడి శుభ్రం చేయక, నల్లాలు పనిచేయక, బకెట్లతో నీళ్లను మోసుకెళ్లలేక పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. గీజర్లు లేక చన్నీటి స్నానాలు చేస్తున్నారు. దోమలతో సావాసం చేస్తున్నారు. చాలా గురుకులాల్లో మెనూ సరిగ్గా అమలు కావటం లేదు. కొన్ని గురుకులాల్లో బెంచీలు లేక నేలమీద కూర్చొని చదువుకుంటుండగా.. ఇంకొన్ని చోట్ల ఆ జాగ కూడా లేక ఆరు బయటే ఉపాధ్యాయులు క్లాసులు బోధిస్తున్నారు.
అద్దె భవనాలే దిక్కు!
రాష్ట్రవ్యాప్తంగా 281 బీసీ , 204 మైనార్టీ గురుకులాలుండగా.. ఒక్కదానికి కూడా సొంత సొంతభవనాల్లేవు. 133 ఎస్టీ గురుకులాల్లో 30.. 268 ఎస్సీ గురుకులాల్లో 150 గురుకులాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. 665 గురుకులాలకు సొంత భవనాలు లేవు. అన్ని గురుకులాల్లో కలిపి 4.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రెసిడెన్షియల్ విధానంలో ఇంగ్లీష్ మీడియం కావడం, ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేయడంతో తల్లిదండ్రులు పోటీపడి గురుకులాల్లో పిల్లలను చేర్పించారు. చదువు సంగతేమోగానీ అక్కడ సౌకర్యాలు, సరైన ఆహారం సరిగ్గా లేక పిల్లలు తిప్పలు పడుతున్నారు. సొంత భవనాలు ఉన్నచోట్ల వసతులు బాగానే ఉన్నప్పటికీ.. అద్దె భవనాల్లో అధ్వాన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు, డార్మిటరీలు, వంటగది, హాళ్లు, బాత్రూంలు లేవు. సరిపడా ఉపాధ్యాయులు ఉండటం లేదు. వారంలో నాలుగురోజులు గుడ్డు, రెండురోజులు మటన్ , రెండు రోజులు చికెన్ పెట్టాల్సి ఉండగా.. వారంలో ఒకరోజు గుడ్డు, ఒకరోజు చికెన్‌తో సరిపెడుతున్నారు. ఇదేంటని అడిగితే కాంట్రాక్టర్ సప్లై చేయట్లేదని, వస్తే పెడ్తామని సిబ్బంది చెప్పడం విశేశం.
సొంత బిల్డింగ్ ఏర్పాటుచేయాలి
గురుకులాలకు సొంత భవనాలు లేకపోవటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సమస్యలతో విద్యార్థులు సహవాసం చేస్తున్నారు. అంటువ్యాధులు ప్రభలుతున్నాయి. సెప్టిక్ ట్యాంకులు లేవు. బాత్రూంలు సరిగా లేవు. తరగతి గదులు విశాలంగా లేవు. మెనూ సరిగా అమలు కావటం లేదు. వీటి పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. లేదంటే ఉద్యమాలు తప్పవు.
- నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి