Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జియోకు 1.29 కోట్ల మంది షాక్..
- అధిక టారీఫ్లకు గుణపాఠం
- నెట్వర్క్ను వీడిన వినియోగదారులు
- 16 లక్షల మందిని కోల్పోయిన వీఐ
హైదరాబాద్ : మొబైల్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచుతూ పోతున్న రిలయన్స్ జియోకు వినియోగదారులు భారీ షాకిచ్చారు. ఒక్క నెలలోనే కోటి మంది పైగా ఆ కంపెనీ నెట్వర్క్ను వీడారు. ఇటీవల జియో, వీఐ, ఎయిర్టెల్ తదితర ప్రయివేటు టెలికం కంపెనీలు మొబైల్ చార్జీలను 20శాతం మేర పెంచటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు బీఎస్ఎన్ఎల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది.
ట్రారు గణంకాల ప్రకారం.. 2021 డిసెంబర్లో దేశ వ్యాప్తంగా 1.28 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు తగ్గారు. జియో, వొడాఫోన్ ఐడియా భారీ ఎత్తున ఖాతాదారులను కోల్పోగా.. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్లో కొత్తగా జోడించబడ్డారు. రిలయన్స్ జియో ఏకంగా 1.29 కోట్ల మంది మొబైల్ ఖాతాదారులను కోల్పోయి.. 41.57 కోట్లకు పరిమితమయ్యింది. వొడాఫోన్ ఐడియా 16.14 లక్షల మంది వినియోగదారులను పోగొట్టుకోవడంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 26.55 కోట్లుగా నమోదయ్యింది.
జియో నుంచి ఎక్కువగా ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్లో చేరారని అంచనా. భారతీ ఎయిర్టెల్ 4.75 లక్షల కొత్త ఖాతాదారులను జోడించుకోవడంతో మొత్తం సంఖ్య 35.57 కోట్లకు చేరింది. బీఎస్ఎన్ఎల్లో ఏకంగా 11 లక్షల మంది చేరారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థ అందిస్తున్న చౌక ఛార్జీల నేపథ్యంలో వినియోగదారులు ఆసక్తిని కనబర్చారు. తాజా గణాంకాలతో బీఎస్ఎన్ఎల్ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఒక్క మాసంలోనే మొత్తంగా 85.4 లక్షల మంది మొబైల్ నెంబర్ పోర్టిబిలిటీ (ఎంఎన్పీ) పెట్టుకోవడం విశేషం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా ఎంఎన్పీలు వచ్చాయి. జియో తొలి రోజుల నుంచి అత్యధిక మంది వాడే బేసిక్ ప్లాన్ రూ.149 ప్లాన్ ధరలను విడతల వారిగా పెంచి ప్రస్తుతం దీన్ని రూ. 239కి చేర్చింది. ఒక కుటుంబంలో తలో ఒక ఫోన్ ఉండటంతో ఇది పెద్ద భారంగా మారింది. దీంతో అదనపు నెంబర్లను పక్కన పెట్టుకోవడమే.. ఇతర నెట్వర్క్ల్లోకి మారడమో చేశామని వినియోగదారులు తెలిపారు.