Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనదేవతల దీవెనలతోనే తెలంగాణ
- మొక్కులు చెల్లించిన దయాకర్‌రావు
- మేడారం జాతరకు వంద ఎకరాల సేకరణ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక నేతగా ఎదిగేలా దీవించాలని మంత్రి దయాకర్‌రావు సమ్మక్క-సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులకు 60 కిలోల బంగారాన్ని సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వనదేవతల దీవెనలతోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా చేసే అవకాశం దక్కిందన్నారు. మేడారం జాతరకు జాతీయ స్థాయి హోదా దక్కేలా కృషి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. గత జాతర అనుభావాలతో ప్రస్తుత జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జాతర కోసం 100 ఎకరాల స్థలాన్ని సేకరించాలని నిర్ణయించగా ప్రస్తుతం 20 ఎకరాలు మాత్రమే సేకరించినట్టు తెలిపారు. త్వరలోనే మిగతా స్థలాన్ని సేకరించి భక్తులకు శాశ్వతమైన సౌకర్యాల కల్పనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్టు వివరించారు.
మీడియా కోసం ప్రత్యేకంగా స్థలాన్ని సేకరించి శాశ్వత భవనం నిర్మించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మేడారం జాతరకు కేంద్రం జాతీయ స్థాయి హోదా కల్పించినా నిధులు ఇవ్వలేదని ఆందోళన వెలిబుచ్చారు. మేడారం జాతర నిర్వహణలో కేంద్రానిది సవతి తల్లి ప్రేమే అన్నారు. అధికారులు, పూజారులు సమన్వయంతో పని చేస్తేనే మహాజాతర విజయవంతం అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జాతరలో సందర్శకులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, పూజారులు, మీడియా అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. మంత్రి వెంట కలెక్టర్ కృష్ణ ఆదిత్య, సమ్మక్క పూజారులు, తదితరులున్నారు.