Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా బడ్జెట్ తీరిది
- 2014-15లో అత్యధికంగా రూ.39 వేల కోట్లు తగ్గుదల
- 2019-20లో రూ.13 వేల కోట్ల తరుగు
- అయినా తగ్గేదేలె అంటున్న సర్కారు
- ప్రతీయేటా పద్దును పెంచుతూ పోతున్న వైనం
బి.వి.యన్.పద్మరాజు
ప్రతీయేటా అంచనాలు తప్పటమే.. అయినా తగ్గేదేలె అన్నట్టుంది బడ్జెట్ పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. మొన్నటిదాకా తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమంటూ చెప్పిన సర్కారు... కరోనా తర్వాత ఆ పదాలను వాడటం మానేసింది. పైగా కరోనాతో తెలంగాణ ప్రత్యక్షంగా రూ.50 వేల కోట్లు, పరోక్షంగా మరో రూ.50 వేల కోట్లు... మొత్తంగా రూ.లక్ష కోట్లు నష్టపోయిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ అంతకుముందు నుంచే, ఇంకా చెప్పాలంటే రాష్ట్ర ఆవిర్భావం నుంచే బడ్జెట్ను ప్రతీయేటా పెంచి చూపిస్తూ పోయారు. వివిధ అంశాలు, రంగాలకు సంబంధించి ప్రభుత్వం వేసుకున్న అంచనాలకు, వాస్తవాలకు మధ్య ఎంతో తేడా ఉంటున్నప్పటికీ... ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా మళ్లీ మళ్లీ పద్దులను పెంచి చూపుతుండటం గమనార్హం. ఈ రకంగా 2014-15 నుంచి మనం వేసుకున్న అంచనాలు, అవి తప్పిన తీరును పరిశీలిస్తే... మొత్తంగా రూ.2.18 లక్షల కోట్లు తక్కువగా వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా అన్ని ఆర్థిక సంవత్సరాల్లో కలిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ల మొత్తం రూ.10,85,435 కోట్లు. అందులో వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ.6,83,619 కోట్లు. అంచనాలు, వాస్తవాలకు మధ్య తేడా రూ.2.18,917 కోట్లు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22కు సంబంధించిన లెక్కలు ఇంకా రావాల్సి ఉంది (ఆర్థిక సంవత్సరం ముగియలేదు కాబట్టి... ఒకవేళ ముగిసినా రావటానికి నెలల సమయం పడుతుంది). వీటిలో 2014-15 మధ్యంతర బడ్జెట్ (నవంబరులో ప్రవేశపెట్టారు)ను రూ.లక్షా రెండు వేల కోట్లతో పద్దును ప్రవేశపెడితే... ఆ యేడాది కేవలం రూ.62,786 కోట్లే ఖజానాకు చేరాయి. అంటే ఆ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.39,386 కోట్ల మేర అంచనాలను చేరుకోలేకపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు అతి పెద్ద అంతరం ఇదే కావటం గమనార్హం. దాంతో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.13,984 కోట్ల మేర అంచనాలు తప్పాయి. ఇప్పటి వరకూ తప్పిన అంచనాల్లో ఇదే తక్కువ. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను గుర్తెరగాలని ఆర్థిక నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు. తద్వారా వాస్తవాల ప్రాతిపదికన బడ్జెట్ను ప్రవేశపెట్టాలని వారు కోరుతున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి మన బడ్జెట్ల తీరిది... (రూ.కోట్లలో )
సంవత్సరం అంచనాలు వాస్తవాలు తేడా
2014-15 1,02,172 62,786 39,386
2015-16 1,27,583 93,417 34,166
2016-17 1,72,269 1,40,606 31,663
2017-18 1,79,551 1,49,127 30,444
2018-19 1,74,454 1,40,200 34,254
2019-20 1,46,492 1,32,509 13,984
2020-21 1,82,914 1,66,728 16,186
2021-22 2,30,825 ------ ------
మొత్తం 10,85,435 6,83,619 2,18,917