Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గద్దెలపైకి చేరిన సమ్మక్క
- అమ్మలకు జన నీరాజనాలు
- మొక్కులు చెల్లించిన మంత్రులు
- నేడు సీఎం రాక
నవతెలంగాణ-మేడారం ప్రాంతీయ ప్రతినిధి
మేడారం పులకించింది. చిలకలగుట్ట మీద నుంచి మేడారంలోని గద్దెలపైకి సమ్మక్క రాకతో మహా జాతరలో కీలకఘట్టం మొదలైంది. భక్త జనహోరులో ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్కను ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య చిలుకలగుట్ట నుంచి గురువారం రాత్రి గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్టించారు. సమ్మక్క తల్లి దర్శనం కోసం ప్రజలు, సందర్శకులు మేడారానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు సమ్మక్క, సారలమ్మ గద్దెల పైనే ఉంటారు. కాగా, బుధవారం ప్రారంభమైన మేడారం జాతరలో అదే రోజు రాత్రి వన దేవత సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. సారలమ్మతోపాటే గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరారు.
గుట్ట దిగొచ్చిన సమ్మక్క తల్లి..
సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చే ఘట్టంలో అత్యంత ఉద్విగ భరిత క్షణాలు చిలకలగుట్ట కిందికి సమ్మక్క దిగిరావడం. మేడారం ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొర్నెబెల్లి శివయ్య, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి పాటిల్ సాయంత్రం 4 గంటలకే చిలుకలగుట్టకు చేరుకున్నారు. గుట్టపై వడ్డేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సమయంలో చిలుకలగుట్ట వద్ద ఆదివాసీ యువత సంప్రదాయ డోలు, కొమ్ము సంగీత వాయిద్యాల నడుమ లయబద్ధంగా నృత్యాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే సీతక్క నృత్యంలో భాగస్వాములై ప్రజలను ఆకర్షించారు. శివసత్తులు, నృత్యాలు, సమ్మక్క, సారలమ్మలకు జైజై అంటూ నినాదాలు చేశారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తన ఏకే-47తో రాత్రి 7.15కు తొలిసారి, మళ్లీ రాత్రి 7.27కు రెండోసారి గాలిలోకి మూడుసార్లు కాల్పులు జరిపారు. ఈ క్షణాల్లో ప్రధాన వడ్డే కొక్కెర కష్ణయ్య భరణి రూపంలో ఉన్న సమ్మక్కని గుట్ట కిందికి తీసుకొస్తారు. ఆ సమయంలో ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికి సమ్మక్కను తీసుకొని గద్దెలవైపు కదిలారు. కిలోమీటరు పొడవునా ప్రజలు కేరింతలు కొడుతూ తల్లులకు నీరాజనం పలికారు. అంతకుముందు సమ్మక్క గద్దె వద్ద జనాన్ని ముందుగానే కట్టడి చేసి గద్దెల వద్ద కొబ్బరికాయలు, బెల్లాన్ని తొలగించి శుభ్రం చేశారు. సమ్మక్కకు దారి పొడవునా ప్రజలు మేకలు, గొర్రెలు, కోళ్లను బలి ఇచ్చారు. ఈ మార్గమధ్యంలో ఎదురుకోళ్ల వద్ద వడ్డెలు సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీసీపీ సాయి చైతన్య, అడిషనల్ ఎస్పీ మురళీధర్ నాయకత్వంలో రోప్‌పార్టీ, భారీ బందోబస్తు, తుడుందెబ్బ కార్యకర్తలు, మేడారం అభ్యుదయ సంఘం అధ్యక్షులు సిద్దబోయిన భోజారావు, కార్యకర్తలు సమ్మక్కను తీసుకురావడంలో భాగస్వాములయ్యారు.
మొక్కులు చెల్లించిన మంత్రులు
సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించగానే దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి పాటిల్, వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షులు కర్నెబెల్లి శివయ్య, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నేతలు పొదెం కృష్ణప్రసాద్, మంకిడి బుచ్చయ్య పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
పోటెత్తిన సందర్శకులు
సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెలపై బుధవారం రాత్రి వడ్డెలు ప్రతిష్టించిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి సమ్మక్కను గద్దెలపై ప్రతిష్టించడంతో లక్షలాదిగా ప్రజలు జాతర ప్రాంగణంలోకి చేరుకున్నారు. మొక్కులు చెల్లించారు. ఈ నేపథ్యంలో జాతర ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. మంత్రి అధికారులతో జాతర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మేడారం నలువైపులా 40 నుంచి 50 కి. మీ. మేర వాహనాలు, గుడారాలు, జాతర కోసం తరలివచ్చిన సందర్శకులతో కిక్కిరిసిపోయింది. కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతు న్నాయి. భక్తుల పుణ్య స్నానాలతో జంపన్న వాగు నిండి పోయింది. శుక్రవారం మరింతగా జనం వచ్చే అవకాశ ముంది. శనివారం సాయంత్రం వరకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. అనంతరం తల్లులను వడ్డెలు వనప్రవేశం చేయిస్తారు. దాంతో మేడారం జాతర ముగుస్తుంది.
నేడు మేడారానికి సీఎం కేసీఆర్ రాక
మేడారం గద్దెపైకి సమ్మక్కను ప్రతిష్టించడంతో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో మొక్కులు చెల్లించడానికి శుక్రవారం రానున్నారు.