Authorization
Thu April 03, 2025 03:35:26 am
నవతెలంగాణ-కామేపల్లి
అర్హులైన నిరుపేదలందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దళితులతో కలిసి అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్తలింగాల ఎక్స్ రోడ్డు వద్ద ఖమ్మం-ఇల్లందు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు దుగ్గి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పగిడిపల్లి ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. మండలంలో దళిత బంధు పథకానికి 16 మంది లబ్దిదారులను ఎంపిక చేయగా.. వారంతా అధికార పార్టీ నాయకులేనని ఆరోపించారు. అంతేకాదు, వారంతా ఆర్థికంగా బలపడిన వ్యక్తులేనన్నారు. అందుకే వెంటనే ఈ జాబితాను రద్దు చేసి నిజమైన పేదవారిని అర్హులుగా ఎమ్మెల్యే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకిచ్చిన మాటను వెంటనే నెరవేర్చేందుకు కృషి చేయాలని, ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ మొండి వైఖరిని విడనాడి అందరికీ దళిత బంధు వచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. దళితులకు న్యాయం జరిగే వరకు దళితులతో కలిసి పోరాడుతామని వారికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్షం జిల్లా మండల నాయకులు,దళితులు తదితరులు పాల్గొన్నారు.