Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మమ్ముల్ని నిలబెట్టిన సంస్థను కాపాడుకుంటాం
- ఐపీఓతో సామాజిక బాధ్యతకు తూట్లు..
- పాలసీదారుల ప్రయోజనాలు పక్కకుపోయే ప్రమాదం : ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌మిశ్రా
- ఎల్ఐసీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఎదుట ఉద్యోగుల క్యాండిల్ ర్యాలీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్ఐసీలో ఐపీఓ వద్దేవద్దనీ, దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌మిశ్రా స్పష్టం చేశారు. తమను ఈస్థాయిలో నిలబెట్టిన ఎల్ఐసీ సంస్థను కాపాడుకుంటామని ప్రతిమబూనారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్ఐసీ హైదరాబాద్ జోనల్ కార్యాలయంలో ఎల్ఐసీ ఉద్యోగులు కొవ్వొత్తుల ప్రదర్శనను చేపట్టారు. 'సేవ్ ఎల్ఐసీ..సేవ్ ఎల్ఐసీ'...'రక్షించుకుంటాం...రక్షించుకుంటాం..ఎల్ఐసీని రక్షించుకుంటాం'...'ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపేయాలి..ఆపేయాలి'...'వద్దువద్దు ఎల్ఐసీలో ఐపీఓ వద్దు'...అంటూ నినాదాలు చేశారు. ఎల్ఐసీ కార్యాలయం ఎదుట రోడ్డువెంబడి వందలాది ఉద్యోగులు నిలబడి వెలుగొందుతున్న కొవ్వొత్తులను ప్రదర్శించారు. ఎల్ఐసీ లోగో స్మరించేలా మహిళా ఉద్యోగులు కొవ్వొత్తులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌మిశ్రా మాట్లాడుతూ..సామాజిక సేవలో భాగంగా ఆవిర్భవించిన బీమా సంస్థ అయిన ఎల్ఐసీలో ఐపీఓ తెస్తే లాభాపేక్ష పెరిగే ప్రమాదం ఉందనీ, అది పాలసీదారుల ప్రయోజనాలకు నష్టదాయకమని చెప్పారు. ఐదు శాతం వాటా ఉపసంహరణ ఎల్ఐసీ బాగు కోసం కాదనీ, కేంద్రం ఖజానా నింపుకునేందుకేనని విమర్శించారు. ప్రారంభం నుంచి దేశ ఆర్థిక, జాతీయ అభివృద్ధిలో ఎల్ఐసీ సంస్థ కీలకపాత్ర పోషించిన తీరును వివరించారు. జాతీయ, పాలసీదారుల ప్రయోజనాలను కాపాడటంలో సంస్థ ముందువరుసలో ఉందన్నారు. మన దేశీయ పొదుపుపై విదేశీ పెట్టుబడుల నియంత్రణను ఏఐఐఈఏ మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నదని చెప్పారు. ఐఆర్డీఏ చట్టం ఆమోదం పొంది ప్రయివేటు బహుళజాతి బీమా సంస్థలను దేశీయ బీమా మార్కెట్ల్లోకి అనుమతి ఇచ్చినప్పటికీ అనేకపోరాటాల ద్వారా నేటికీ ఎల్ఐసీ వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతున్నదని చెప్పారు. కొంతమేర వాటాల ఉపసంహరణ అంటే ఎల్ఐసీని ప్రయివేటీకరించడం కాదని ప్రచారం చేస్తున్న వారి వాదనలో పసలేదన్నారు. పాలకవర్గాలు బీఎస్ఎన్ల్, ఎమ్టీఎన్ఎల్ టెలికాం రంగ సంస్థలను నిర్వీర్యం చేసిన తీరును వివరించారు. ఎల్ఐసీలో ఐపీఓను ప్రయివేటీకరణలో తొలి అడుగుగా భావించాలన్నారు. ఇది ప్రభుత్వ బీమా రంగానికే ప్రమాదకరమన్నారు. ఉద్యోగులూ అభద్రతా భావంలోకి వెళ్తున్నారని చెప్పారు. ఐపీఓ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టాక్మార్కెట్లో లిస్టు చేసిన మొదటిరోజే ఒకరోజు సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. మార్చి 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త రెండు రోజుల సమ్మెలోకీ ఎల్ఐసీలో ఐపీఓ వద్దనే డిమాండ్‌తోనే వెళ్తామని చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈవీ వాల్యూ లక్షా ఐదు వేల కోట్ల రూపాయలేననీ కేంద్రం చెప్పిందనీ, క్రమం తప్పకుండా పోరాటాలతో నేడు దాన్ని ఐదు లక్షల 40 వేల కోట్లకు పెంచడం జరిగిందని చెప్పారు. ఎల్ఐసీ పరిరక్షణ కోసం ఏఐఐఈఏ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నొక్కి చెప్పారు. అయితే, ఎల్ఐసీలో జరుగుతున్న పరిణామాల వల్ల భవిష్యత్‌లో ఎలాంటి నష్టం జరుగబోయే ప్రమాదం ఉందో చెబుతూ పాలసీదారులను చైతన్యపర్చి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉద్యోగులపై ఉందన్నారు. ఏఐఐఈఏ అధ్యక్షులు రమేశ్, హైదరాబాద్ జోనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, సౌత్‌సెంట్రల్ జోనల్ కార్యదర్శి రవీంద్రనాధ్, ఉపాధ్యక్షులు సుజాత, హైదరాబాద్ జోనల్ సంయుక్త కార్యదర్శులు మద్దిలేటి, గిరిధర్, డివిజనల్ ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, ఉమెన్స్ కన్వీనర్ మైథిలీ, తదితరులు పాల్గొన్నారు.