Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చల ద్వారా వివాదాల పరిష్కారానికి సిద్ధం స్పష్టంచేసిన తెలంగాణ
- తెలంగాణ సివిల్ సప్లయిస్‌కు బకాయిలు చెల్లించేందుకు ఎపి అంగీకారం
- రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ స్పష్టంచేసింది. వివాదాలకు సంబంధించి కోర్టు కేసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంటేనే అది సాధ్యమవుతుందని రాష్ట్ర అధికారులు తెలిపారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌కు బకాయిలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ నేరుగా తెలంగాణ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు బదిలీ అయ్యేలా ఎపి అండర్‌టేకింగ్ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సంస్థల నిధుల వివాదం, ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల పంపిణీ, పన్నులు, బ్యాంకు డిపాజిట్లు, సివిల్ సప్లయిస్ తదితర అంశాలపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ గురువారం ఢిల్లీ నుంచి ఎపి, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ నుంచి ఆర్ధిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ట్రాన్స్‌కో సిఎండి డి. ప్రభాకర్ రావు, వాణిజ్య పన్నుల కమిషనర్ నీతు ప్రసాద్, సివిల్ సప్లైస్ ఎండి అనిల్ కుమార్ హాజరయ్యారు.రాష్ట్ర విభజన తర్వాత అకస్మాత్తుగా తెలంగాణకు ఎపి జెన్కో విద్యుత్ సరఫరా నిలిపివేసిందని, ఆసమయంలో అధిక ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావడం రాష్ట్రానికి భారంగా మారిందని తెలంగాణ తెలిపింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రుణ మాఫీ, థర్మల్ విద్యుత్ కొనుగోలు ఖర్చులు పరిగణనలోకి తీసుకుంటే టిఎస్ జెన్కోకు ఎపిజెన్కో రూ.12,532 కోట్లు చెల్లించాల్సి ఉందని రామకృష్ణారావు చెప్పారు. బకాయిలు చెల్లించకుండా ఎపి ప్రభుత్వం హైకోర్టులో కేసు దాఖలు చేసిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులో ఉన్న కేసులు విత్‌డ్రా చేసుకుంటే చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ స్పష్టంచేసింది. టిఎస్ జెన్కోకు రూ.3,442 కోట్లు చెల్లించేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎపిఎస్ఎఫ్సి) విభజన ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా కేంద్రానికి పంపిందని తెలంగాణ పేర్కొంది. తమకు ప్రాతినిధ్యం ఉండేలా ఎపిఎస్ఎఫ్సి బోర్డు పునర్ నియమించాలని కేంద్రాన్ని కోరింది. ఎపిఎస్ఎఫ్సికి 253 ఎకరాల భూ కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ హైకోర్టును ఆశ్రయించి ఎపి ప్రభుత్వం స్టేటస్ కో పొందిందని,నానక్‌రామ్‌గూడలోని కార్పొరేషన్ ఆస్తుల పంపకాల్లో కూడా వివాదం నడుస్తోందని తెలంగాణ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అందువల్ల ఎపి పునర్వవస్థీకరణ చట్టాన్ని సవరించాలని, అందులో లోపాలను సరిచేయాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ కేంద్రాన్ని కోరింది. గతంలో కూడా పలు సందర్భాల్లో కేంద్రానికి నివేదించామని ఎపి అధికారులు కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, చట్టం అమలులోకి వచ్చి ఏడున్నరేండ్లు దాటిపోయిందని, ఇప్పుడు చట్ట సవరణ అవసరంలేదని తెలంగాణ పేర్కొంది. దాని వల్ల సమస్యలు పెరుగుతాయని, పరిష్కారమైన వివాదాలు మళ్లీ సమస్యాత్మకంగా తయారవుతాయని అభిప్రాయపడింది. చట్ట సవరణలు సాధ్యం కాకపోతే సంబంధిత నష్టాలను కేంద్రం భర్తీ చేయాలని ఎపి ప్రతిపాదించింది. దీనిపై హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ స్పందిస్తూ...ఈ అంశం ద్వైపాక్షిక సమస్య కాదని, ఎజెండా నుంచి తొలగిస్తామని రెండు రాష్ట్రాలకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన బ్యాంకు డిపాజిట్లను వెంటనే చెల్లించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. కేంద్ర పథకాలకు సంబంధించి రూ.495.21కోట్లు తెలంగాణకు రావాల్సిఉందని, హైకోర్టు, రాజ్‌భవన్, సాధారణ ఖర్చులకు సంబంధించి రూ.315కోట్లు, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు రూ.464కోట్లు ఎపి ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉందని, క్రెడిట్ క్యారీడ్ ఫార్వర్డ్ కింద రూ.208 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. తెలంగాణ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రూ.354 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ఎపి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ గతంలో అంగీకరించినా.. ఇప్పటివరకు జమ చేయలేదని తెలంగాణ తెలిపింది. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్‌కు బదిలీ అయ్యేలా అండర్‌టేకింగ్ ఇచ్చేందుకు ఎపి స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ అంగీకరించింది. త్వరలోనే ఉత్తర్వులు కూడా ఇస్తామని ఎపి అధికారులు తెలిపారు.