Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన హరిత నిధి (తెలంగాణ గ్రీన్ ఫండ్) వసూళ్లకు విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీవో నెంబర్ 16, ప్రజాప్రతినిధులనుద్దేశించి జీవో నెంబర్ 17ను వేర్వేరుగా విడుదల చేశారు. ఐఏఎస్ అధికారులు సంవత్సరానికి రూ.1,200, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, టీచర్లు, వివిధ కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులు సంవత్సరానికి రూ.300 చొప్పున గ్రీన్ టాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు ఏడాదికి రూ.6వేలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల చైర్మెన్లు రూ.1,200, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు రూ.120 చొప్పున పన్ను కట్టాలని జీవో నెంబర్ 17లోపేర్కొన్నారు. అలాగే వివిధ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టర్లు ఆయా పన్నుల్లో ప్రభుత్వం నిర్దేశించిన శాతం ప్రకారం గ్రీన్‌టాక్స్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.