Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భిక్కనూర్
అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం లక్ష్మిదేవుని పల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుజూసింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాలిన రాజయ్య(42) తనకున్న ఎకరన్నర భూమిలో సాగు చేయడంతో పాటు కూలీ పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అప్పులు కావడంతో వాటిని తీర్చేందుకు గల్ఫ్ బాట పట్టాడు. కాగా అక్కడ ఆరోగ్యం సహకరించకపోవడంతో తిరిగి వచ్చాడు. దాంతో అప్పులు పెరిగిపోయాయి. సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులున్నట్టు సమాచారం. దీనికి తోడు అనారోగ్య సమస్యలు వేధిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గ్రామ శివారులోని పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు రెండవ ఎస్ఐ హైమద్ తెలిపారు.