Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడ్రోజుల్లో ముగ్గురు దుర్మరణం
- తాజాగా లారీ ఢకొీని ఉపాధ్యాయురాలి మృతి
- జనం ఆగ్రహం .. చెక్‌పోస్టుపై దాడి
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
వందలమంది ప్రాణాన్ని బలితీసుకున్న ఈ రహదారి.. వాహనదారుల పాలిట ప్రమాదకరంగా మారింది. ఆ దారి గుండా వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్ వద్ద నిర్మించిన మలుపు వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ సర్వీసు రోడ్లు నిర్మించాలని అనేక ఏండ్లుగా జనం కోరుతున్నా..పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. వరుసగా మూడ్రోజుల్లో ముగ్గురు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణం కోల్పోయారు. శుక్రవారం ఉపాధ్యాయురాలు పద్మజారెడ్డిని లారీ ఢకొీనడంతో అక్కడికక్కడే చనిపోయారు. దాంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. సమీపంలోని చెక్‌పోస్టుపై దాడి చేసి ఫర్నీచర్, కుర్చీలు ధ్వంసం చేశారు. జాతీయ రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు.ఈ నెల 16న భోరజ్‌కు సమీపంలోని గిమ్మ ఎక్స్‌రోడ్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో జైనథ్ మండలం ఆకోలి గ్రామానికి చెందిన వడ్డారపు రాజారెడ్డి మృతిచెందారు. గ్రామం నుంచి ఆదిలాబాద్‌కు వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢకొీనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ నెల 17న ఇచ్చోడ మండలం బోరిగాం గ్రామానికి చెందిన బాలిక చైత్ర(13) లారీ ఢకొీని మృతిచెందారు. జ్వరం రావడంతో తండ్రితో కలిసి పిప్పర్వాడలోని పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరగా.. భోరజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణం సంజరునగర్లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయురాలు పద్మజారెడ్డి(55) బేల మండలం హేటి ప్రాథమిక పాఠశాలకు వెళ్తుండగా భోరజ్ చెక్‌పోస్టు వద్ద లారీ ఢకొీనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మూడు రోజుల్లో ముగ్గురు మృతిచెందడం.. వరుసగా ప్రమాదాలు జరగడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
ఐదు గంటలు రాస్తారోకో..
భోరజ్ వద్ద శుక్రవారం ప్రమాదం జరిగిందని తెలుసుకున్న స్థానికులు, జైనత్, బేల, ఆదిలాబాద్ మండలాల ప్రజలు భారీఎత్తున అక్కడికి చేరుకున్నారు. జాతీయ రహదారి నుంచి ఆయా గ్రామాలకు వెళ్లేందుకు సర్వీసు రోడ్లు లేకపోవడం, చెక్‌పోస్టు ఉండటంతో నిత్యం పదుల సంఖ్యలో భారీ వాహనాలు రోడ్డుపైనే నిలబడి ఉండటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు ఐదు గంటలు జాతీయ రహదారిపై బైటాయించి రాస్తారోకో చేపట్టారు. వీరికి జైనథ్ జడ్పీటీసీ అరుంధతి, ఎంపీపీ గోవర్ధన్, పీఏసీఎస్ చైర్మెన్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. చివరకు జిల్లా అదనపు కలెక్టర్ నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్టీఏ అధికారి పుప్పాల శ్రీనివాస్‌తో పాటు ఎన్హెచ్ఏఐ, కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు నాయకులతో చర్చలు జరిపారు. సర్వీసు రోడ్ల నిర్మాణంతో పాటు మృతుల కుటుంబాలకు పరిహారం వచ్చేలా కృషిచేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. సాయంత్రం సమయంలో కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ ఉదరుకుమార్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.