Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక సౌకర్యాలతో కోహెడలో ఏర్పాటు
- లే అవుట్ అప్రూవల్ రాగానే పనులు ప్రారంభిస్తాం
- బాట సింగారం తాత్కాలిక మార్కెట్లోనూ అన్ని వసతులు: మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్/తుర్కయంజాల్
అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్‌గా చెప్పుకునేలా కోహెడలో నూతన పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభించి ఏడాదిన్నరలోగా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. ఇక్కడి పండ్ల మార్కెట్ ఏర్పాటుకు లే అవుట్ అప్రూవల్ రాగానే పౌండేషన్ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాట సింగారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ అభివృద్ధి పనులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అలాగే తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో కోహెడలో ఉమార్ ఖాన్‌గూడ నుంచి పండ్ల మార్కెట్ వరకు నిర్మించనున్న వంద ఫీట్ల రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, బాటసింగారంలో విలేకరుల సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.తాత్కాలిక పండ్ల మార్కెట్లో రైతులకు, వ్యాపారులకు అన్ని విధాలుగా వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ పండ్ల మార్కెట్ విస్తరణలో భాగంగా 12 ఎకరాలు, పండ్ల దిగుమతికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం మరో 5 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నట్టు తెలిపారు. కొహెడలో మార్కెట్ నిర్మాణం పూర్తయ్యాక దశల వారీగా బాటసింగారం నుంచి తాత్కాలిక మార్కెట్‌ను తరలిస్తామన్నారు.ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను కోహెడలో 178 ఎకరాల్లో నిర్మించబోతున్నామని చెప్పారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తామన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా దుకాణాలను కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, పర్యవేక్షణ ఇంజినీర్ లక్ష్మణ్ గౌడ్, మార్కెటింగ్ కార్యదర్శి చిలక నరసింహారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతు సమితి జిల్లా అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.