Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయనే మా ఫస్ట్ వాలంటీర్ : చినజీయర్ స్వామి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో/శంషాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చినజీయర్‌స్వామి స్పష్టం చేశారు. సమతామూర్తి విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో ఆయనే తమ తొలి వాలంటీర్ అని చెప్పారు. మీడియా అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ చర్చ జరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. 'మీడియాకు పిల్లి బొమ్మను ఇస్తే, మీసాలతో పాటు అవసరం లేని గీతలు గీసి, దాన్ని పులిగా చూపిస్తారు' అని వ్యాఖ్యానించారు. శుక్రవారంనాడాయన ముచ్చింతల్‌లోని రామానుజుల విగ్రహ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివారం అక్కడి 108 దివ్యక్షేత్రాల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈనెల 20 నుంచి సాధారణ భక్తులకు కూడా సువర్ణ రామానుజుల విగ్రహ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. సమతావాదం, సామ్యవాదం అనేవి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చాయని ప్రజలు భ్రమ పడతారనీ, వాళ్లు కండ్లు తెరవకముందే భారతదేశంలో ఆ వాదాలు ఉన్నాయని అన్నారు. రామానుజుల విగ్రహావిష్కరణకు కేవలం అధికారంలో ఉన్నవారినే పిలిచారనే విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా, అలాంటిదేం లేదన్నారు. తమకు అలాంటి రాజకీయాలు అవసరం లేదనీ, ఎవరైనా రావొచ్చని చెప్పారు. ముస్లిం లీడర్లకు కూడా తాము అరబిక్ భాషలో ఆహ్వానపత్రికలు ముద్రించి పంపామనీ, స్పానిష్ భాషలోనూ పత్రికలు ముద్రించామన్నారు. ముఖ్యమంత్రితో విభేదాలు ఉంటే ఇంతపెద్ద కార్యక్రమం సక్సెస్ అయ్యేది కాదనీ, రాష్ట్రప్రభుత్వ సహకారం ఉండబట్టే 10వేల మంది పోలీసులు, ఇతర శాఖల ఉద్యోగులు ఇక్కడ పనిచేశారనీ, కరెంటు, నీరు సౌకర్యాలు అప్పటికప్పుడు కల్పించారని వివరణ ఇచ్చారు. ఇంతపెద్ద కార్యక్రమం నిర్వహించేటప్పుడు చిన్న చిన్న లోపాలు సహజమేనన్నారు.