Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని రద్దు చేయాలి :సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ పట్టణంలో చిరు వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేయొద్దని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ.మొహినుద్దీన్ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ,ఐఎన్టీయూసీల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణంలో రోడ్ల వెంట జీవనోపాధి కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారు రోజు మొత్తం కష్టపడ్డా రూ.300 గిట్టుబాటు కాదన్నారు. కుటుంబ పోషణ, విద్య, వైద్యానికే సరిపోక ఇబ్బంది పడుతున్నారన్నారు.అలాంటి వారి నుంచి రోజుకు రూ.50-100 వసూలు చేయడం దుర్మార్గమైన చర్యన్నారు. తై బజార్ పేరుతో వసూలు చేస్తున్న పన్నులను ఎవరూ కట్టొద్దని వ్యాపారులకు సూచించారు. చిరు వ్యాపారులకు మున్సిపల్ ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చి ఉపాధి కోసం రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.పనుల వసూలుపై మున్సిపల్ పాలకవర్గం పునరాలోచన చేయకుంటే భవిష్యత్తులో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.ధర్నాకు ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాశం, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎండి.సలీం,కాంగ్రెస్ జిల్లా నాయకులు ముంతాజ్ అలీ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మద్దతు పలికి మాట్లాడారు. చిరు వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ కౌన్సిల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అంటే పేదలను దోచుకు తినడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏకమయ్యాయని విమర్శించారు. జీవనోపాధి లేక పట్టణాలకు వలస వచ్చి రోడ్ల వెంట వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వారి నుంచి పన్నులు వసూలు చేయడం సిగ్గుమాలిన చర్యని అన్నారు. వెంటనే మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని, చిరు వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సయ్యద్ ముసాక్ హమీద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఐఎన్టీయూసీ,వివిధ ప్రజా సంఘాల నాయకులు అద్దంకి నరసింహా,ఎండి.జమాలుద్దీన్,కోటగిరి శేఖర్,బొడ్డుపల్లి ధనంజరు, గుండాల నరేష్, భూతం అరుణకుమారి,ఎండీ.షరీఫ్,ప్రభాకర్ పాల్గొన్నారు.