Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ అధ్వర్యంలో రైతుల నుండి 78,500 రికవరీ
నవతెలంగాణ-గార్ల
డీసీపీబీ బ్యాంకు ద్వారా 2015 సంవత్సరంలో గ్రూపులుగా తీసుకున్న రుణాలు పూర్తిగా చెల్లించాలని స్థానిక బ్యాంకు మేనేజర్ కే సౌజన్య కోరారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో రాంపురం, దుబ్బగూడెం, పెద్ద కిష్టాపురం, గార్ల, పూమ్యతండా, గోపాలపురం, పినిరెడ్డిగూడెం గ్రామాలలో శుక్రవారం బ్యాంకు అధికారుల బందం ఇండ్ల వద్దకు వెళ్ళి ఆస్తులను జప్తు చేశారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ అయా గ్రామాలకు చెందిన 24 మంది దాదాపుగా 5 లక్షల రూపాయలు గ్రూప్ రుణాలుగా తీసుకున్నారని వారికి ఎన్ని సార్లు ముందస్తు సమాచారం అందించినా, నోటిసులు ఇచ్చిన రుణాలు చెల్లించకపోవటంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఇండ్ల వద్దకు వెళ్ళి రూ.78,500 రికవరీ చేశామని తెలిపారు. కొంత మంది రైతులకు చెందిన కొంత సామగ్రిని ఇండ్ల వద్ద నుండి వాహనంలో తరలించి, మళ్ళీ సిబ్బంది ద్వారా తిరిగి పంపించామని తెలిపారు. మూడు రోజుల్లో మిగతా రుణాలు చెల్లిస్తామని రైతులు హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత బ్యాంకు అధికారులు, సూపర్ వైజర్లు నాగరాజు, కష్ణ, సోమన్న, దిశాలి, అపర్ణ, సీఈఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
భయాందోళనకు గురైన బాధితులు
శుక్రవారం మండలం లోని వివిధ గ్రామాల్లో గ్రూప్ రుణాలు చెల్లించాలని రైతుల ఇండ్ల వద్దకు వెళ్ళి ఆస్తులను జప్తు చేసిన బ్యాంకు అధికారుల తీరుతో రైతులు, స్దానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా బ్యాంకు అధికారులు, పోలీసులు జీపుతో గ్రామాలలోకి రాగానే ఏం జరుగుతుందోనని భయాందోళనలకు గురయ్యారు. కరోన కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడ్డ రైతులకు మిర్చి పంటలకు తెగులు, వరి, ప్రత్తి పంటలు అశించిన స్దాయిలో దిగుబడి రాకపోవడంతో రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డామనీ, అధికారులు అప్పులు చెల్లించాలని ఇలా గ్రామంలో పరువు తీస్తారని అను కోలేదని బాధిత రైతులు ఆవేదన వెలిబుచ్చారు. అన్నదాతలను అప్పులు చెల్లించాలని ఇంటికి తాళాలు వేయడం, వాహనాలు, మంచాలను తరలించడం పట్ల రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు కందునూరి శ్రీనివాస్, కట్టె బోయిన శ్రీనివాస్, జడ సత్యనారాయణలు తీవ్రంగా ఖండించారు.