Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు మహిళ రౌండ్‌టేబుల్‌లో వ్యక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతున్నదని తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం ఆధ్యర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం అభిప్రాయపడింది. మద్యాన్ని నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలుగు మహిళ అధ్యక్షురాలు ప్రొఫెసర్ టి. జ్యోత్స్న అధ్యక్షతన 'మద్యంపై యుద్ధం..మద్యం నియంత్రణ కోసం పోరాటం' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా మహిళా సంఘాలకు చెందిన నేతలు హాజరై మాట్లాడారు. అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ టి.జ్యోత్స్న మాట్లాడుతూ మద్యపాన నియంత్రణ చేయకపోతే సమాజం నష్టపోతుందని అభిప్రాయపడ్డారు. యువత, మహిళలు, చిన్నారుల జీవితాలు నాశనమవుతున్నాయని చెప్పారు. ఆదాయం కోసం ప్రజల జీవితాలను బుగ్గి చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరాశోభన్ మాట్లాడుతూ మద్యం మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగడానికి కారణమవుతున్నదని చెప్పారు. గ్రామాల్లో జ్వరమొస్తే మందులు దొరుకుతున్నాయో లేదో కానీ, మద్యం మాత్రం అందుబాటులో ఉంటున్నదని విమర్శించారు. బంగారు తెలంగాణ అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నంచారు. మహిళా కాంగ్రెస్ ప్రతినిధి సుజాత మాట్లాడుతూ రాష్ట్రంలో బెల్ట్‌షాపులే లేవన్న ప్రభుత్వం అక్రమంగా అమ్మిన వారిపై 9,972 కేసులు నమోదు చేసినట్టు చెప్పిందని అన్నారు. తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర అద్యక్షులు బక్కని నర్సింహ్మ మాట్లాడుతూ మద్యం మూలానా ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మద్యం, గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని విమర్శించారు. యువత మత్తుకు బానిసై నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి గడ్డి పద్మావతి, ఉపాధ్యక్షులు కానూరి జయశ్రీ, ఎన్ ప్రమీళ, సూర్యదేవర ఝాన్సీ, ఆశాబిందు, సామాజిక కార్యకర్తలు కోట నీలిమా, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.