Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ అంశాలపైనా సెస్‌తో కలిసి పనిచేస్తాం :మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్థిక, సామాజిక అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసినప్పుడే ఏ రాష్ట్రమైనా, దేశమైనా అన్ని రంగాల్లో పురోగతి చెందుతుందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు అన్నారు. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యమవుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేటలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో విద్యార్థినీల వసతి గృహానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సెస్‌ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ ఆ సంస్థ ఎప్పటికప్పుడు విలువైన సూచనలు చేస్తున్నదని వివరించారు. జాతీయ స్థాయిలో ఇక్కడి పీహెచ్డీ కోర్సుకు డిమాండ్ ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు చేరుతున్నారని అన్నారు. వారి అవసరాల నిమిత్తం రూ.ఐదు కోట్లతో బాలికల వసతి గృహం నిర్మిస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో బడ్జెట్ అంశాలకు సంబంధించి సెస్‌తో మరింత కలిసి పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, సెస్ వ్యవస్థాపక సభ్యులు జె మహేందర్‌రెడ్డి, జిఆర్ రెడ్డి, డైరెక్టర్ ఈ రేవతి, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, మాజీ చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీ సెక్షన్ డెలివరీలు తగ్గించాలి
సిజేరియన్ డెలివరీలు తగ్గించి, సహజ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాతా, శిశు మరణాలను పూర్తిగా తగ్గించాలని సూచించారు. ప్రసవం జరిగిన వెంటనే కేసీఆర్ కిట్లు అందించాలనీ, మాతా, శిశు మరణాలు, సాధారణ మరణాలు, సి సెక్షన్లపై ఆడిటింగ్ రిపోర్ట్ సిద్ధం చేయాలని సూచించారు.