Authorization
Tue April 01, 2025 11:26:07 pm
- సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కోసం త్వరలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేస్తామని టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు చెప్పారు. శుక్రవారంనాడాయన కార్మిక సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. డిస్కంల సీఎమ్‌డీలు జీ రఘుమారెడ్డి, ఏ గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎమ్డీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నుంచి 327 యూనియన్ ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్, 1104 యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే పద్మారెడ్డి, జీ సాయిబాబు, 1829 యూనియన్ ప్రధాన కార్యదర్శి వీ గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకరరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు రూ.4,095 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నాయని చెప్పారు. ఓ ఏడాదిపాటు వేతన సవరణను వాయిదా వేయాలని భావించామనీ, కానీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరలోనే వేతన సవరణపై కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంస్థ ఉద్యోగులందరూ లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈసారి ఆర్టిజన్లకు మరింత న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే, కొంతమేరకే ఆర్థిక ఉపశమనం లభిస్తుందనీ, మిగిలిన నష్టాలను అంతర్గత సామర్థ్యం పెంపుద్వారా సాధించాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలోనే మరోసారి కార్మిక సంఘలతో భేటీ అవుతామన్నారు.