Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోం సీఎం హిమంతపై చర్యలు తీసుకోండి: మహిళ కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ తండ్రి ఎవరంటూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తంచేసింది. మహిళల విషయంలో సంస్కారహీనంగా మాట్లాడి 'తల్లులను క్షోభ పెట్టారు. సీఎం హిమంత బిశ్వ శర్మ నాలుక కోయాలి. ప్రధాని మోదీకి సంస్కారం ఉంటే వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలి' అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జె గీతారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మెన్ సునీతా లక్ష్మారెడ్డికి సీఎం హిమంతపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిమంత శర్మ ఓ మూర్ఖుడని వ్యాఖ్చానిం చారు.రాహుల్‌గాంధీకి, సోనియా గాంధీ తల్లి అని ఆయనకు తెల్వదా? అని ప్రశ్నించారు. అన్ని పోలీస్స్టేషన్లలో ఆయనపై తాము ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని విమర్శించారు. ఉద్యోగాలడిగితే రేవంత్‌రెడ్డిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. హిమంత నిన్నటి వరకు కాంగ్రెస్ ఉప్పుతిన్నారనీ, పదవి కోసం దిగజారి మాట్లాడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి విమర్శించారు. సీఎం అయినంత మాత్రాన హిమంతకు కొమ్ములు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో మాట్లాడితే ఊరు కునేదిలేదని హెచ్చరించారు. ఆడవారు తిరగబడితే తట్టుకోలేవని హెచ్చరించారు. అనంతరం హిమంత దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నిర్మల, నీలంపద్మ తదితరులు ఉన్నారు.
అరెస్టులకు నిరసనగా
ప్రగతిభవన్ ముట్టడికి యత్నం
గత రెండురోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నదని ఆ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మెన్ ప్రీతం ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా శుక్రవారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నేడు మేడారం జాతరకు రేవంత్
టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి శనివారం మేడారం జాతరకు వెళ్లనున్నారు. ఆ సందర్భంగా సమ్మక, సారలమ్మను దర్శించుకోనున్నారు.