Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలోని వివాదస్పద ఫాంహౌస్ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ ఐటీ మంత్రి కేటీఆర్, ఫాంహౌస్ అధిపతి వేర్వేరుగా దాఖలు చేసిన కేసుల్లో హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. శంకర్పల్లి మండలంలో జీవో 111కి వ్యతిరేకంగా కేటీఆర్ ఫాంహౌస్ నిర్మాణం చేశారని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్‌రెడ్డి ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. ఒక కమిటీ వేసిన ఎన్జీటీ రిపోర్టు నివేదించాలని గతంలో ఆదేశించింది. దీనిని కేటీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. తనకు తెలియకుండా తనను ప్రతివాదిగా చేయకుండా రేవంత్‌రెడ్డి ఎన్జీటీలో కేసు వేశారని ఫాం హౌజ్ ఓనర్ ప్రదీప్‌రెడ్డి కూడా రిట్ వేశారు. వీటిపై శుక్రవారం సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు వాయిదా పడింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ నవీన్‌రావుల డివిజన్ బెంచ్ ఆదేశాలను జారీ చేసింది. తీర్పును తర్వాత వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఎన్జీటీ ఉత్తర్వులపై ఇదివరలోనే హైకోర్టు స్టే ఇచ్చింది. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదిస్తూ, రాజకీయ ఉద్ధేశంతోనే రేవంత్‌రెడ్డి ఎన్టీటీలో కేసు వేశారని చెప్పారు. ఏనాడో కట్టిన దానిపై కేసు వేస్తే ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎన్జీటీకి ఉండదన్నారు. ఆరు నెలల్లోగా కేసు వేస్తేనే ఎన్జీటీ విచారణ చేయాలన్నారు. ఈ వాదనలను రేవంత్ తరఫు లాయర్ ఎస్ఎస్ ప్రసాద్ వ్యతిరేకరించారు. ఎన్జీటీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలేగానీ హైకోర్టుల్లో కాదన్నారు. హుస్సేన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరీవాహక ప్రాంతంలో నిర్మాణం చూసేందుకు రేవంత్‌రెడ్డి వెళితే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి జైలుకు పంపారని చెప్పారు. ఫాం హౌస్ ప్రదీప్‌రెడ్డిదని, ఆయనకు తెలియకుండానే రేవంత్‌రెడ్డి ఎన్జీటీ నుంచి ఆర్డర్ పొందడం చెల్లదని ప్రదీప్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఎన్జీటీ ఆర్డర్‌పై హైకోర్టు జోక్యం చేసుకోవచ్చునని అదనపు ఏజీ రామచంద్రరావు చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది.
వేరే రాష్ట్రంలో కేసుకు ఇక్కడ సవాలా ?
ముంబైలో కేసు పెడితే దానిని తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయడమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. అక్కడి హైకోర్టులోనే కేసు వేసుకోవాలని చెప్పింది. బొగ్గు సరఫరా నిమిత్తం గంగాధర్ ఆయిల్ రీఫైనరీ వైస్ చైర్మన్ కే కైలాష్పారేకర్తో ఇంద్ భారత్ థర్మల్ పవర్, జెన్కాం లిమిడెట్ల డైరెక్టర్ డీ మధుసూదన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ రఘురామకష్ణంరాజు ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.61 కోట్ల విలువైన బొగ్గు సరఫరా చేస్తే సుమారు రూ.15 కోట్లనే చెల్లించారని మధుసూదన్‌రెడ్డిపై ముంబై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. దీనిని కొట్టేయాలని ఆయన వేసిన రిట్లో ఉత్తర్వుల జారీకి న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ నిరాకరించారు.
స్త్రీ, పురుషుల ఎత్తు ఒకేలా ఉండాలనడం సరికాదు
ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఏఈఎస్)గా ప్రమోషన్స్ ఇవ్వడానికి స్త్రీ, పురుషుల శారీరక కొలతలు ఒకేలా ఉండటం అన్యాయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకేలా కొలతలు ఉండటం సరికాదంది. ఏఈఎస్ పోస్టులకు అర్హత సాధించాలంటే స్త్రీ, పురుషుల ఎత్తు 165 సెంటీమీటర్లు ఉండాలనే నిబంధనపై 155 సెంటీమీటర్ల ఎత్తున్న రమ్యకుమారి హైకోర్టులో సవాలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి డివిజన్ బెంచ్ విచారించింది. ఎత్తు కొలతలు ఒకే విధంగా ఉండటం వివక్షే అవుతుందని చెప్పింది.