Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన చట్టం హామీల అమల్లో కేంద్రం విఫలం
- పోడు దరఖాస్తులను పరిష్కరించకుండానే దాడులా? :సీపీఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటుచేయబోయే ఫ్రంట్‌ను స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి చెప్పారు. మోడీని గద్దెదించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరముందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ సర్కారు హక్కులను హరిస్తున్నదనీ, మతోన్మాదాన్ని, ఫాసిస్టు విధానాలను రెచ్చగొడుతున్నదని విమర్శించారు. లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష కూటమి దేశానికి అవసరమని అన్నారు. మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ భ్రష్టుపట్టించిందని చెప్పారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని వెల్లడించారు. బీజేపీ నియంతృత్వంగా, మతోన్మాదం, ఫాసిస్టు ధోరణితో పాలన సాగిస్తున్నదని విమర్శించారు. ఆ పార్టీ దూకుడును అరికట్టడానికి అన్ని రాజకీయ పార్టీలూ ఏకం కావాలని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని వివరించారు. బీజేపీని ఉమ్మడిగానే ఎదుర్కోగలమంటూ గతంలో కేసీఆర్‌ను కలిసినప్పుడు చెప్పామని గుర్తు చేశారు. దాని వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేసే అంశంపై పార్టీ జాతీయ సమితి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను పరిష్కరించాలనీ, హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా విభజన చట్టాల హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యుత్ బకాయిలు తమకంటే తమకే రావాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంటున్నాయని చెప్పారు. ఈ అంశంపైనా కోర్టును ఆశ్రయించాయని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదన్నారు. జల వివాదాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి వివాదాస్పదంగానే ఉన్నాయని అన్నారు.సాగుదార్ల నుంచి దరఖాస్తులను స్వీకరించినా సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయనీ, గ్రామసభ నిర్వహించలేదనీ, అయినా అటవీ శాఖ అధికారులు పోడు రైతులపై ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన పోడుసాగుదార్లందరికీ పట్టాలివ్వాలని కోరారు.