Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడారంలో వేడుకగా మొక్కులు
- నేడు వనప్రవేశం..సీఎం కేసీఆర్ పర్యటన రద్దు
నవతెలంగాణ-మేడారం ప్రాంతీయ ప్రతినిధి
మేడారం మహాజాతరలో శుక్రవారం వనదేవతలకు జనం నీరాజనం పలికారు. సారలమ్మ, సమ్మక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు వనం నుంచి గద్దెల మీదకు చేరడంతో మేడారంలో సందర్శకుల తాకిడి పెరగడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. శుక్రవారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వీఐపీల తాకిడి పెరగడంతో వనదేవతల సందర్శనకు సందర్శకులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా సీఎం కేసీఆర్ పర్యటన రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. సీఎం పర్యటన కోసం అధికారులు శుక్రవారం ఉదయం నుంచే భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం పర్యటన రర్దయినట్టు తెలిసింది. ఇదిలావుంటే సీఎం కేసీఆర్ శుక్రవారం మేడారం వస్తారని మంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా కుటుంబసభ్యులతో మేడారం చేరుకున్నారు. మధ్యాహ్నాం 2.00 గంటల వరకు సీఎం పర్యటన కోసం వేచి చూసి రద్దు కావడంతో వెళ్లిపోయారు. పలు ప్రాంతాలకు చెందిన జనం వనదేవతలకు తెల్లవారుజాము నుంచి మొక్కులు చెల్లించడానికి పోటెత్తారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, తదితర రాష్ట్రాలకు చెందిన గిరిజనులు నృత్యాలతో తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించారు.
కేంద్ర మంత్రుల రాక
శుక్రవారం పెద్ద సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వీఐపీలు వచ్చి వీరవనితలకు మొక్కులు సమర్పించుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ జాతరకు వచ్చారు.. వీరి వెంట గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టియానా జెడ్ చొంగ్తో, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, బీజేపీ నాయకులు లక్ష్మణ్, ఈటల, ప్రేమేందర్‌రెడ్డి తదితరులున్నారు.
మంత్రులు, వీఐపీల రాక
సీఎం మేడారానికి రానున్నారన్న సమాచారంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుటుంబసమేతంగా మేడారానికి తరలివచ్చారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ములుగు జడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్, జనగామ జడ్పీ చైర్మెన్ పాగాల సంపత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, తదితరులు కుటుంబసమేతంగా జాతరకు విచ్చేశారు. తమ ఎత్తు బంగారాన్ని (బెల్లం) వనదేవతలకు చెల్లించుకున్నారు.
నేడు వనప్రవేశం
వనదేవతలు సారలమ్మ, సమ్మక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఈనెల 19న శనివారం సాయంత్రం 4 గంటలకు వనప్రవేశం చేయనున్నారు. వనదేవతలను తీసుకొచ్చిన తరహాలోనే పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, ఇతర పూజారులు, వడ్డెలు వనదేవతలు వనదేవతలను తిరిగి యథాస్థానానికి చేర్చుతారు.