Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాప సభలో ఐద్వా జాతీయ నాయకురాలు టి.జ్యోతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పర్స భారతి ఆశయాలను కొనసాగించాలని ఐద్వా జాతీయ నాయకురాలు టి.జ్యోతి పిలుపునిచ్చారు. ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పర్స భారతి సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో టి.జ్యోతి మాట్లాడుతూ.. పర్స భారతి తుదిశ్వాస వరకూ మహిళల సమస్యల పరిష్కారం కోసం, ఉద్యమాభివృద్ధికి తపించారని అన్నారు. ఆమె జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి మహిళా ఉద్యమానికి నిరంతరం కృషి చేశారని చెప్పారు. ఆమె వ్యక్తిగత జీవితంలో చేసిన త్యాగాలు వెలకట్టలేనివన్నారు. ట్రేడ్ యూనియన్ ఉద్యమ నాయకులు పర్స సత్యనారాయణ జీవిత భాగస్వామిగానేగాక ఉద్యమ సహచరిణిగా ఉంటూ మహిళా ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలనూ ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతో కషి చేశారని చెప్పారు. అనేకమంది మహిళలకు ఆప్త మిత్రురాలిగా వారి కష్టసుఖాల్లో పాలు పంచుకొన్నారని గుర్తు చేశారు.
ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అర్.అరుణ జ్యోతి మాట్లాడుతూ.. పర్స భారతి కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటూనే మహిళా ఉద్యమంలో చురుకుగ్గా పాల్గొనే వారని చెప్పారు. మహిళలపై హింస పెరుగుతున్న తరుణంలో ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు.
ఐద్వా నగర కార్యదర్శి కె.నాగలక్మి మాట్లాడుతూ.. పర్స సత్యనారాయణ నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లినా, పోలీసుల వేధింపులు తీవ్రంగా వున్నా భారతి తట్టుకోవడంతోపాటు కుటుంబ భారం తనపై వేసుకుని ధైర్యంగా నిలబడ్డారని చెప్పారు. మహిళా ఉద్యమానికి ఎనలేని సేవలు అందించారన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సీఐటీయూ నగర నాయకురాలు వాణి మాట్లాడుతూ.. పర్స భారతీ అమ్మాలా అందరినీ ఆదరించేవారని, పర్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నా కుటుంబం ఎప్పుడూ సాధారణ జీవితాన్ని గడిపిందన్నారు. వారిద్దరి ఆశయాలనూ ముందుకు తీసుకెళ్లడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్షులు ఎ.పద్మ, నాయకులు షబానా, పి.విమల, భవాని, ప్రవళిక, లావణ్య, స్వరూప, రాధిక తదితరులు పాల్గొన్నారు.