Authorization
Wed April 02, 2025 01:18:10 am
- కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక బడ్జెట్‌పై ఆందోళనలు
- 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె.. 25న గ్రామీణ బంద్
- సీఐటీయూ, వ్యకాస, రైతుసంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ: వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి ప్రజావ్యతిరేకమైనదని వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు తెలిపారు. ప్రభుత్వరంగ ఆస్తులను విక్రయించి తద్వారా వచ్చిన ఆదాయంతో దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలనే రీతిలో కేంద్రం బడ్జెట్ ఉందన్నారు. దీన్ని నిరసిస్తూ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతుసంఘాల ఆధ్వర్యంలో మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె, దీనికి సన్నాహంగా 25న గ్రామీణ బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో చూపిన రూ.35 లక్షల కోట్ల ఆదాయంలో ప్రభుత్వ ఆస్తుల అమ్మడం ద్వారా రూ.11లక్షల కోట్లు సమకూర్చుకుంటామని కేంద్రం పేర్కొనడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వరంగ ఆస్తులను అమ్మే హక్కు మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. విమానాలు, బీఎస్ఎన్ఎల్లో వాటాలు అమ్మడం, ఎల్ఐసీ ప్రయివేటీకరణ, గనుల విక్రయం ద్వారా రూ.7లక్షల కోట్లు సమకూర్చుకుంటామని చెప్పడం దారుణమన్నారు. ఆహారభద్రతకు గత బడ్జెట్లో రూ.2.70లక్షల కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రూ.2.05 లక్షల కోట్లకు కుదించడంతో వ్యవసాయరంగం కుదేలయ్యే ప్రమాదం ఉందన్నారు. ఫుడ్, కాటన్ కార్పొరేషన్ వంటి సంస్థలు నిర్వీర్యం అవుతాయన్నారు. పంటలకు మద్దతు ధర లభించదన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు కూడా ముప్పు వాటిల్లుతుందన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడం కోసమే ఇలాంటి కుటిలయత్నాలు అని ఆరోపించారు. ఎరువులు, పురుగుమందుల సబ్సిడీకి రూ.20వేల కోట్లు కోత విధించారని తెలిపారు. గతంలో ఉపాధి హామీకి రూ.లక్ష కోట్లు నిధులు కేటాయిస్తే.. ఇప్పుడు రూ.73వేల కోట్లకు కుదించారని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మంది ఉపాధి లేక అవస్థలు పడుతుంటే ఎన్ఆర్ఈజీఎస్కు నిధులు తగ్గించడం సరికాదన్నారు. రాష్ట్రాలు, కార్మికుల హక్కులను హరించేలా బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఏ ఒక్క జాతీయ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదని తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు గిరిజన యూనివర్శిటీ, కాళేశ్వరానికి జాతీయ హోదా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ... వీటి ఊసేది బడ్జెట్లో లేదన్నారు. అనేక మంది రాజకీయ నాయకులకు బినామీగా ఉండి వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కాజేసిన చినజీయర్‌స్వామి ఆస్తులపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కులం పేరుతో రాష్ట్రపతి కోవింద్‌కు జరిగిన అవమానంపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిజనిర్ధారణ చేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని, చిన్న, కుటీరపరిశ్రమలను దెబ్బతీయడంతో సామాన్య ప్రజానీకంపై భారం వేసే నూతన విద్యుత్ చట్టాలను సైతం ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు, వ్యవసాయ కార్మక సంఘం, తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శులు పొన్నం వెంకటేశ్వర్లు, మాదినేని రమేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విష్ణు, కళ్యాణం వెంకటేశ్వరరావు, కోశాధికారి ఎం.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.