Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరతరాలుగా అన్యాయమే : కేవీపీఎస్ వెబినార్‌లో బీవీ రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాజిక న్యాయానికి విఘాతం కలిగించేదిగా ఉందనీ, తరతరాలుగా దళితులు, గిరిజనులు మోసపోతూనే ఉన్నారని దళిత సోషల్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) కార్యదర్శి బీవీరాఘవులు తెలిపారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 'కేంద్ర బడ్జెట్-దళితుల సమగ్రాభివృద్ధి' అనే అంశంపై సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు సమన్వయంతో వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్.. సామాజిక న్యాయానికి ఏ మేరకు న్యాయం చేస్తుందో పరిశీలించాల్సిన అవసరముందన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు, వికలాంగులు తదితర తరగతులకు ఈ బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు. బడ్జెట్లోని అంకెలు చూసి సంబరపడితే నష్టం జరుగుతుందని తెలిపారు. వాస్తవంగా ఈ బడ్జెట్లలో ధనవంతులకు, భూస్వాములకు, పారిశ్రామిక వేత్తల కేటాయింపులకు సంబంధించి అంతగా కత్తిరింపులు ఉండబోవని లెక్కలతో ఉదహరించారు. ఈ కత్తిరింపులకు గురయ్యేది దళితులు, గిరిజనులు, మహిళలు ఇతర సామాజిక వెనుకబాటుకు గురయ్యే ప్రజానికమేనని గుర్తుపెట్టుకోవాలన్నారు. పది శాతానికి మించి కత్తిరింపులుంటే ఆ తరగతులకు తీవ్ర అన్యాయం చేసినట్టేనని చెప్పారు. దళితులకు బాగా ఖర్చు చేశామని చెప్పినప్పుడు కూడా కేటాయించిన బడ్జెట్ నుంచి 20శాతం కత్తిరించారనీ, గిరిజనులకు అదే పరిస్థితి సృష్టించారని తెలిపారు. ఆ రకంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో పెరుగనున్న ధరలను అంచనా వేసి కేటాయింపులు చేశారా? లేదా? అని పరిశీలించాల్సిన అవసరముందన్నారు. ఈ రూపంలో చూసినప్పుడు సామాజిక తరగతులకు కేటాయించిన బడ్జెట్ అంకెల్లో చూపినా.. వాస్తవంగా ధరలను పరిగణలోకి తీసుకుంటే జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు జరగలేదన్నారు. అందుకే కేంద్రం అర్థిక దోపిడితో పాటు సామాజిక అణచివేతకు పాల్పడుతున్నదని విమర్శించారు. ప్రజలనుంచి పన్నుల రూపంలో పిండి, కార్పొరేట్ల లాభాలను గడించే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని చెప్పారు. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచకుండా బడ్జెట్‌ను గాడిలో పెట్టలేమన్నారు. అప్పుల మీద ఆధారపడి దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకుపోవాలని చూడటం సరికాదన్నారు. అప్పులకు వడ్డీలు చెల్లించటం కోసం మళ్లీ అప్పులు తెస్తే..అది ప్రజలకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. మోడీ సర్కారుది అప్పులకు వడ్డీలు చెల్లించే బడ్జెట్ అన్నారు. 2019కి ముందే దేశం ఆర్థికంగా దివాళా అంచున ఉందని చెప్పారు. కరోనా కాలంలో అది మరింత దెబ్బతిన్నదన్నారు. అయితే ప్రజలను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమయిందని చెప్పారు. కానీ..పారిశ్రామిక వేత్తలు మాత్రం బాగా లాభపడ్డారని చెప్పారు. సుమారు రూ.20 లక్షల కోట్లు ఉద్ధీపనలు ప్రకటించి వారి ప్రయోజనాలను కాపాడిందని చెప్పారు. పేదలు మాత్రం ఉన్న కాస్త ఆదాయాన్ని ఆస్పత్రులకు ఖర్చు చేశారనీ, ఆర్థికంగా బాగా దిగజారారని వివరించారు. రోగాన్ని కూడా లాభాలకు అనువుగా ఉపయోగించుకునేలా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం తోడ్పడిందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలు పేదల్లో అంతర్భాగంగా ఉన్న దళితులకు మరింత నష్టం తీసుకువచ్చే విధంగా ఉందని వివరించారు. దేశంలో ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ శక్తులు దళితులు, గిరిజనులమీద అత్యంత పాశవికంగా దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నాయని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. చెప్పారు. ఇలాంటి సమయంలో వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులను పటిష్టం చేయటం కోసం తగిన రీతిలో బడ్జెట్లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం ఉద్యమం చేయటం వల్ల దళితుల్లో కొంత చైతన్యం వచ్చిందన్నారు. వారికి కేటాయించిన నిధులను తగిన రీతిలో ఖర్చు చేయకుండా ప్రభుత్వాలు ఇతర రంగాలకు మళ్లిస్తున్నాయన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావటం లేదని చెప్పారు. వీటిని రాబట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దారిమళ్లించిన నిధులను తిరిగి ఆయా రంగాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వాటాకోసం టీఆర్ఎస్ సర్కార్ కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరముందన్నారు.