Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా
- డ్రాలో పేర్లు రాని వారికి నెల రోజుల్లో పట్టాలు: అధికారులు
- అదనపు కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డ్రాలో పేర్లు రాని ప్రజలు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పదిరోజులుగా ఆదోళనలు చేస్తున్న బాధితులు శనివారం కలెక్టరేట్ ఎదుట రెండుగంటలపాటు ధర్నా చేశారు. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించాలని నినాదాలు చేశారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, కలెక్టరేట్ ఏఓ గంగయ్య బాధితుల దగ్గరకొచ్చి మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల డ్రాలో పేర్లు రాని వాళ్లందరికీ ఒక నెలరోజుల్లో పట్టాలు అందిస్తామని, ఆ తరువాత ఇల్లు కట్టుకోడానికి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో 10 రోజుల నుంచి చేస్తున్న పోరాటాన్ని విరమిస్తున్నట్టు నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ.. 10 రోజుల నుంచి డబుల్ బెడ్ రూమ్ రాని నిరుపేదలు పట్టు వదలకుండా పోరాటం చేయడం వల్లే ప్రభుత్వం దిగొచ్చి అందరికీ పట్టాలు ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. దీనితోపాటు అనర్హులకు ఇండ్ల కేటాయింపుపై కూడా సర్వే చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. డబ్బులు తీసుకున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారని, ప్రజల పోరాటం ఫలితంగానే ఇవన్నీ సాధించుకున్నారని తెలిపారు. పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. సమస్యలు నెల రోజుల్లోపు పరిష్కరించకపోతే మళ్లీ పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. పేదల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మీడియాకు వందనాలు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, గన్నారం నర్సయ్య, సూరం పద్మ, గోవిందు లక్ష్మణ్, గడ్డం ఐలయ్య, గుండు రమేష్, సబ్బని చంద్రకాంత్, సామల కవిత, సప్న, లత, మానస, రాజేశ్వరి పాల్గొన్నారు.