Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ రైతుల ఖాతాల్లో రూ.1.28 కోట్లు జమ
- సీఎస్పీ నిర్వాహకుడి డ్రాతో వెలుగులోకి..
- పీఎం కిసాన్ ద్వారా వచ్చాయనుకున్నామంటున్న రైతులు
నవతెలంగాణ-విద్యానగర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ)లో డబ్బుల గోల్మాల్ వ్యవహారం వెలుగు చూసింది. ముగ్గురు ఆదివాసీ రైతుల అకౌంట్లలో రూ.1.28కోట్లు జమ కావడం.. కిసాన్ క్రెడిట్ కార్డుల నుంచి సీఎస్పీ నిర్వాహకుడు రమేష్ రూ.లక్షలు డ్రా చేయడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అధికారులు ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గ్రామ పరిధిలోని సల్పలగూడ గ్రామానికి చెందిన ముగ్గురు ఆదివాసీ రైతుల ఇండ్లల్లోకి వెళ్లారు. డబ్బులు, బంగారం, వస్తువులను తీసుకురావడంతో ఈ డబ్బుల గోల్మాల్ బయటపడింది. దీంతో ఆదివాసీ కొలాం సంఘం జిల్లా అధ్యక్షులు కొడప సోనేరావు బాధిత రైతులతో కలిసి శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు తరలివచ్చారు. మీ వల్ల జరిగిన తప్పుకు రైతులను ఇబ్బంది ఎలా పెడతారని బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మండల పరిధిలోని చిన్న సల్పలగూడకు చెందిన ముగ్గురు ఆదివాసీ రైతుల కిషాన్ క్రెడిట్ కార్డుల సాయంతో మామిడిగూడ కస్టమర్ సర్వీస్ పాయింట్(సీఎస్పీ) నుంచి రూ.1.28కోట్లు సెంటర్ నిర్వాహకుడు జెటల రమేష్ డ్రా చేశాడు. డిసెంబర్ నుంచి విడతల వారీగా డబ్బులు డ్రా చేశాడు. చిన్న సల్పలగూడకు చెందిన మడావి రాంబాయి(3.5ఎకరాలు), కొడప భీంరావు(10 ఎకరాలు), కొడప గంగాదేవి (5 ఎకరాలు) కిసాన్ క్రెడిట్ కార్డుల నుంచి ఈ డబ్బులు డ్రా అయినట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. ముగ్గురు రైతులకు రూ.16లక్షలు ముట్టజెప్పిన సీఎస్పీ నిర్వాహకుడు రమేష్ మిగిలిన డబ్బును కాజేశాడు. ఆదివాసీ రైతుల అకౌంట్ల నుంచి రూపాయి కూడా కట్ కాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీఎస్పీ నిర్వాహకుడు ఇచ్చిన డబ్బులతో సంబంధిత రైతుల్లో ఒకరు ఇంటి నిర్మాణం, మరొకరు అప్పులు చెల్లించడం, ఇంకొకరు సొంతానికి ఖర్చు చేసుకున్నారు. బ్యాంకు అధికారులు ఈ డబ్బులు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పీఎం కిసాన్ ద్వారా తమ అకౌంట్లో డబ్బులు వేశారని అనుకుని ఖర్చు చేసుకున్నట్టు రైతులు చెబుతున్నారు. తాజాగా, రైతులు బ్యాంకుకొచ్చి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఇదిలా ఉండగా, నేరుగా బ్యాంక్ సర్వర్ నుంచే డబ్బులు డ్రా అయినట్టు బ్యాంక్ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో గ్రామీణ బ్యాంక్ యంత్రాంగం అప్రమత్తమైనది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు బ్యాంక్ చీఫ్ మేనేజర్ వివేక్ తెలిపారు.