Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు
- మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్
- లబ్దిదారులకు రూ.15.30 కోట్ల యూనిట్ల పంపిణీ
నవతెలంగాణ-కరీంనగర్‌టౌన్
నిన్న కూలీలు, వాహన డ్రైవర్లుగా పని చేసినవారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అన్నారు. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో శనివారం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్‌తో కలిసి దళితబంధు లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వాహనాలను అందజేశామని చెప్పారు. యూనిట్ల పంపిణీతో ప్రభుత్వంపై దళితులల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. 146 మంది లబ్దిదారులకు 63 యూనిట్లుగా.. 51 హార్వెస్టర్లు, 4 జేసీబీలు, 6 డీసీఎం వ్యాన్లు, ట్రాక్టర్, వరి నాటు యంత్రాలు అందజేశారు. మొత్తంగా రూ.15 కోట్ల 30 లక్షల 84413 విలువ చేసే వాహనాలను లబ్దిదారులకు అందించినట్టు తెలిపారు. ముగ్గురు లేదా నలుగురు కలిసి బృందంగా ఏర్పడి హార్వెస్టర్లు, జేసీబీలు, డీసీఎం వ్యాన్ ఎంపిక చేసుకున్నారన్నారు. వీటితో లబ్దిదారులు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లబ్దిదారులు లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని చెప్పారు. దళితబంధు పథకం అమలు నిరంతర ప్రక్రియ అన్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నాలుగు మండలాల్లో అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రులు ట్రాక్టర్ నడిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీకర్ణన్, జడ్పీటీసీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మేయర్ వై.సునీల్‌రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ హుజూరాబాద్ ఇన్చార్జి ఆర్డీవో మయాంక్ మిట్టల్, కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్ కుమార్, హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.