Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాబోయే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆ సంఘం హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ చిన్న చిన్న వృత్తులు చేసుకుని జీవిస్తున్నవారికీ, వీధి వ్యాపారులకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. 2016-17 సంవత్సరంలో చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలని లక్షా డెబ్బై ఆరువేల మంది దరఖాస్తులు చేసుకున్నారనీ, అయితే ఆరేండ్ల కాలంలో కేవలం ఎనిమిది వేల మందికి మాత్రమే ఆర్థిక సహాయం అందిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ఈ ఎనిమిదేండ్ల కాలంలో రూ.12లక్షల కోట్ల బడ్జెట్లో 15 శాతం జనాభా ఉన్న మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ. 6,500 కోట్లకు మించిలేదన్నారు. దీన్ని బట్టే మైనార్టీల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతున్నదని విమర్శించారు.
స్కాలర్ షిప్లు, మైనార్టీ గురుకులాలు మినహా సంక్షేమానికి పెద్దగా కేటాయింపులు లేవని చెప్పారు. లక్షల కోట్ల విలువైన వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా చితికిపోయిన, విద్య, ఉద్యోగాలలో వెనుకబడిన మైనారిటీలు అభివృద్ధి చెందాలంటే బడ్జెట్ పెంచకుండా సాధ్యం కాదని చెప్పారు. ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిషన్ నివేదిక ఇదే విషయాన్ని చెప్పిందని గుర్తుచేశారు. ఉత్తుత్తి హామీలతో మభ్యపెట్టడం మాని, మైనార్టీల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. మైనారిటీ బంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టి యువతకు, మహిళలకు, చిరు వ్యాపారులకు ఉపాధి కల్పన కోసం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా లో ఆవాజ్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి మహమ్మద్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.