Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన జాతరంటే చిన్న చూపా..?
- గుడులను, బడులను అడ్డం పెట్టుకుని రాజకీయం
- వైఖరి మార్చుకోకపోతే ఉరికించి కొడ్తం..:మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- అన్ని శాఖల సమన్వయంతో జాతర విజయవంతం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/తాడ్వాయి
''ఆలయాలను సందర్శించే ప్రధాని మోడీ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి ఎందుకు రాలేదు ? గిరిజనుల జాతర అని చిన్న చూపా ? కుంభమేళాకు రూ.325 కోట్లు ఇచ్చి, మేడారానికి రూ.2.50 కోట్లు ఇస్తారా? గుడులను, బడులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.. వైఖరి మార్చుకోకపోతే ఉరికించి కొడ్తాం'' అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీజేపీ నేతలను హెచ్చరించారు. మేడారం మీడియా పాయింట్లో శనివారం విలేకరుల సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ములుగు జెడ్పీ చైర్మెన్ జగదీశ్‌తో కలిసి మంత్రి దయాకర్‌రావు మాట్లాడారు. జాతర విజయవంతానికి అధికార, పోలీసు యంత్రాంగం, నాయకులు, ప్రజాప్రతినిధులు చేసిన కృషి అభినందనీయమన్నారు.
బీజేపీ నేతలు జాతరకు వచ్చి రాజకీయాలు మాట్లాడిన నేపథ్యంలో తప్పని పరిస్థితిలో తాను రాజకీయాలు మాట్లాడాల్సి వస్తోందన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించరా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గిరిజన యూనివర్సిటీని నేటికీ ఇవ్వలేదని అన్నారు. ఆంధ్రాకు యూనివర్సిటీ ఇచ్చారని, రూ.784 కోట్లు కేటాయించారని తెలిపారు. అక్కడ క్లాసులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. తెలంగాణ గిరిజన బిడ్డలు పీఎంకు కనిపించడం లేదా ? మేడారం జాతరలా కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలేమయ్యాయని మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌కు ఐటీఐఆర్, ఐఐఎఐం నేటికీ ఏర్పాటు చేయలేదన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా దిక్కులేదన్నారు. పసుపు బోర్డు నిజామాబాద్‌కు వచ్చిందా అని ప్రశ్నించారు. మీరు సాధించి తీసుకొచ్చిన నిధులేమిటో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును అవమానపరిస్తే నోరు విప్పని సన్నాసులు, చవటలు.. మీరా తెలంగాణ గురించి, సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేది అని అన్నారు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బీజేపీ నేతలకు హితవు పలికారు.
అన్ని శాఖల సమన్వయంతో జాతర విజయవంతం
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగామని మంత్రులు అన్నారు. జాతరను విజయవంతం చేసిన అధికారులను సత్కరించారు. అధికారులు ముందు నుంచి సూక్ష్మస్థాయిలో ప్రణాళికతో ముందుకు సాగడంతో జాతరలో సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలూ కలగలేదని చెప్పారు. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షించారన్నారు. అన్ని శాఖల మధ్య సమన్వయంతో ఏర్పాట్లు చేశారన్నారు.
జంపన్నవాగు వద్ద గతంలో కన్నా ఎక్కువ స్నానాల ఘాట్లను నిర్మించామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. ముఖ్యంగా కలెక్టర్, ఎస్పీ క్షేత్ర స్థాయిలో ఉండి సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే సీతక్క, ఎంపీలు, ఇతర ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిదులతో పాటు తామంతా సమన్వయంతో పనిచేశామన్నారు.