Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాజాతర పట్ల పాలకుల వివక్ష
- ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలి
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-తాడ్వాయి/గోవిందరావుపేట
ప్రజాసమస్యల పరిష్కారం కోసం వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో పోరాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మేడారం మహాజాతర పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష పాటిస్తున్నాయన్నారు. ఆయన శనివారం మేడారంలోని వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో శ్రేణులు ఘనస్వాగతం పలికారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరుపెట్టాల్సి ఉండగా సీఎం కేసీఆర్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. తద్వారా వనదేవతల పోరాట స్ఫూర్తిని, తెలంగాణ అత్మగౌరవాన్ని కించపర్చారన్నారు.
వనదేవతల పోరాట చరిత్రను కనుమరుగు చేసేలా కుట్ర చేస్తున్నారన్నారు. చిన్నజీయర్ స్వామి, రామేశ్వరరావు నిర్మించిన ఆలయాలకు ఇచ్చిన విలువ సమ్మక్క జాతరకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం మేడారం జాతరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ముచ్చింతల్‌కు వచ్చిన ప్రధాని మోడీ మేడారానికి రాకపోవడంలోని ఆంతర్యాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. జాతరకు ఏటా రూ.500 కోట్లు కేటాయించాలని, వెంటనే సమ్మక్క-సారక్క జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతం చేసి పోరాటాల ద్వారా గుణపాఠం చెప్పాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రజలకు సుపరిపాలన అందిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ప్రజలు అధికారంలోకి తీసుకొస్తారని దీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డీసీసీ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి, దొమ్మాటి సాంబయ్య, రామచంద్రు నాయక్, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల అధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి, జెడ్పీటీసీలు పుల్సం పుష్పలత తదితరులు పాల్గొన్నారు.