Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో పార్టీ పదవులకు రాజీనామా : జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తన పదవులకు రాజీనామా చేసి స్వతంత్రంగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్టు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి వెల్లడించారు. త్వరలోనే పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. తనను టీఆర్ఎస్ కోవర్టుగా ముద్ర వేయడం బాధకల్గిస్తున్నదని చెప్పారు. ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు శనివారం రాయబారం నడిపారు. బుజ్జగించారు. ఈ క్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ ఆయన కాళ్లు పట్టుకున్నారు. వీహెచ్ రాయబారంతో జగ్గారెడ్డి కొంతమేరకు శాంతించినట్టు బొల్లు కిషన్ నవతెలంగాణకు తెలిపారు. తనను కలిసిన విలేకర్లతో జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇక నుంచి తాను పార్టీకి దూరంగా ఉంటానని చెప్పారు. సోనియగాంధీ, రాహుల్‌గాంధీకి లేఖ రాసినట్టు చెప్పారు. తాను స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకుంటాననీ, సోనియా, రాహుల్‌ను గౌరవిస్తూనే ఉంటానన్నారు. ఈ క్షణం నుంచి తాను కాంగ్రెస్ గుంపులో లేనన్నారు. కాంగ్రెస్‌ను వీడాలని లేదనీ, తాజా పరిస్థితులు తనను అటు వైపుగా ఆలోచన చేసేలా ఉన్నాయన్నారు.ఆర్థిక కష్టాల్లోనూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ,ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కోవర్టు అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని చెబితే అప్పుడు నన్ను తెలంగాణ ద్రోహి అన్నారు.'నా వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో పార్టీ వీడాలనుకున్నా. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లినా..వేరే పార్టీలో చేరను.సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, వీహెచ్‌తో పాటు పలువురు నేతలు తొందరపడి నిర్ణయం తీసుకోవ ద్దని నాకు చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో రెండు..మూడు రోజులు ఆగుతున్నా. లేకపోతే ఇప్పుడే రాజీనామా చేసే వాణ్ని. కాంగ్రెస్ బాగుండాలనే ఉద్దేశంతోనే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యా, నేను పార్టీ వీడినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగాను. పదవులు ఆశించడం, అందుకోసం ప్రయత్నించడం రాజకీయాల్లో సహజం. కానీ, నామీద కోవర్టు అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతున్నది.' అని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.