Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూలన పడిన 3వేల పత్రాలు
- మూడేండ్లుగా పెండింగ్‌లోనే..
- సిబ్బంది లేరనే పేరుతో కాలయాపన
- సమావేశమవ్వని బోర్డు సలహా కమిటీ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కార్మిక శాఖలో దరఖాస్తులు మూలనపడ్డాయి.. మూడేండ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కార్మికులకు సంక్షేమబోర్డు నుంచి అందించే ప్రోత్సహకాలు సరైన సమయంలో అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మూడేండ్లుగా లబ్దిదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా కార్యాలయం నుంచి బోర్డుకు పంపితే వెంటనే మంజూరయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సిబ్బంది లేరనే కారణం చూపి పక్కనబెట్టారు.
సంక్షేమ బోర్డులో నమోదు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 1,26,149 మంది కార్మికులు సంక్షేమ బోర్డులో పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో మహిళలు 64,482, పురుషులు 61,044 ఉన్నారు. ఇందులో నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం పరిహారం, బహుమతుల పేరుతో కొంత ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రసూతి (రెండు కాన్పుల వరకు) రూ.30,000, పెండ్లి బహుమతి రూ.30వేలు, సహజ, ప్రమాద మరణం పొందితే ఆ కుటుంబానికి రూ.లక్ష సహాయం, అంత్యక్రియలకు రూ.30వేలు, పాక్షిక అంగవైకల్యం పొందితే జరిగిన నష్టాన్నిబట్టి అందిస్తారు.
మూడేండ్లుగా క్లైమ్లు పెండింగ్
భవన నిర్మాణ, కార్మిక సంక్షేమ బోర్డు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లోనే 2009లో ఏర్పడింది. అయితే, మూడేండ్లుగా క్లైమ్లు పెండింగ్‌లో ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 1536, సూర్యాపేటలో 1200, యాదాద్రి భువనగిరిలో 500పైగా ఉన్నాయి. ఇందులో కూడా నల్లగొండ అసిస్టెంట్ లేబర్ అధికారి పరిధిలో దాదాపు 1000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్మికుల దరఖాస్తులను ఎప్పటికప్పుడూ ఆన్లైన్ చేయడానికి సిబ్బంది లేరనే కారణం చూపి నిర్లక్ష్యం వహిస్తున్నారు. 'క్లైమ్లు చేయడం ఒక్కటే మా పని కాదు.. ఇతరత్రా పనులు చాలా ఉన్నాయి' అంటూ కార్మికులతో చులకనగా మాట్లాడుతున్నారని, ఎన్నిసార్తు తిరిగినా తమకు సహాయం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో బడ్జెట్ సమస్య కూడా లేదు. ఇప్పటికే సుమారు రూ.2వేల కోట్ల బడ్జెట్ ఉందని సమాచారం. దానిని వినియోగించకుండా కార్మికులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు.
శాఖలో అన్ని ఖాళీలే..
కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన కార్మిక శాఖ సిబ్బంది లేక వెలవెల బోతుంది. ఉమ్మడి జిల్లాలో 8 అసిస్టెంట్ కార్మికశాఖ అధికారి కార్యాలయాలున్నాయి. అందులో నల్లగొండ 4, సూర్యాపేట 2, యాదాద్రి భువనగిరి 2 కేంద్రాలున్నాయి. సూర్యాపేట, యాదాద్రి నాలుగు, నల్లగొండలో ఏఎల్వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కిందిస్థాయిలో ఆఫీసు సిబ్బంది కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే కార్మికులను సంక్షేమబోర్డులో నమోదు చేసుకోవడం, క్లైమ్స్ దరఖాస్తులు స్వీకరించడం, పరిష్కరించడంలో ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.
బోర్డు సమావేశాలెక్కడా..?
రాష్ట్ర స్థాయిలో సంక్షేమ బోర్డుకు సలహా కమిటీని నియమిస్తారు. అదే కోవలో జిల్లాలో కూడా కమిటీని నియమించారు. దానికి జిల్లా కార్మికశాఖ అధికారి చైర్మెన్‌గా ఉంటారు. వివిధ కార్మిక సంఘాల నాయకులను సభ్యులుగా నియమిస్తారు. జిల్లాలో కార్మికుల సమస్యలు, వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు తదితర వాటి గురించి చర్చిస్తారు. కానీ జిల్లా బోర్డు సమావేశం ఏర్పాటు చేయక దాదాపు మూడేండ్లు గడుస్తుంది. ఒకవేళ ఎవరైనా కార్మిక సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేయాలంటే 'అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది ఇక సమావేశాలతో ఏం పని' అంటూ జిల్లా అధికారి చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో పరిహారం కోసం దరఖాస్తు చేసిన వారి నుంచి వసూళ్లు కూడా చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటిపై చర్చించాలనుకుంటే సమావేశాలే నిర్వహించడం లేదని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు.
త్వరలో పూర్తి చేస్తాం
పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. డివిజన్ స్థాయిలో అధికారులు, కొంత సిబ్బంది లేకపోవడం వల్ల ఆలస్యమైంది. ఈ మధ్య ఒకరిద్దరు అధికారులు వచ్చారు. తొందరలోనే అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం.
రాజేంద్రప్రసాద్- జిల్లా కార్మికశాఖ అధికారి
పెండింగ్ సమస్యను పరిష్కరించాలి
సంక్షేమ బోర్డు నుంచి కార్మికుల కుటుంబాలకు రావాల్సిన బెనిఫిట్స్‌ను వెంటనే అందేలా కార్మికశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. కార్మికులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. సిబ్బంది లేరని పనులు ఆగడంలేదు.... కేవలం కార్మికుల పనులే ఎందుకు పెండింగ్‌లో ఉంటాయి. ఇప్పటికైనా సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేయాల్సివస్తుంది.
చిన్నపాక లక్ష్మినారాయణ-
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నల్లగొండ