Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ డాక్టర్ తమిళిసై
- వనదేవతలకు చీర, సారెలు సమర్పణ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/ఏటూర్‌నాగారం
మేడారం మహాజాతర దేశం గర్వించతగినదని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆమె శనివారం సాయంత్రం మేడారం జాతరకు చేరుకున్నారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సమ్మక్క, సారలమ్మలను గవర్నర్ దర్శించుకున్నారు. పూజారులు ఆలయ మర్యాదలతో దేవాలయం వద్దకు తీసుకెళ్లారు. నిలువెత్తు బంగారాన్ని గవర్నర్ వనదేవతలకు సమర్పించారు. సమ్మక్క, సారలమ్మలకు చీర, సారెలను, గోవిందరాజులు, పగిడిద్దరాజులకు పంచెలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క గవర్నర్‌కు శాలువా కప్పి సన్మానించారు. పూజారులు గవర్నర్‌కు చీరె, పసుపు, కుంకుమలతోపాటు బంగారం (బెల్లం), జ్ఞాపికను అందజేశారు. తొలుత ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి గవర్నర్‌కు స్వాగతం పలికారు. గవర్నర్ వెంట ఎమ్మెల్యే సీతక్క, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఆర్డీఓ రమాదేవి, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు తదితరులు ఉన్నారు.
గవర్నర్ పర్యటనలో కనిపించని మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు
గవర్నర్ మేడారం పర్యటనలో మంత్రులు, ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ కనిపించలేదు. హన్మకొండలోని హరిత హోటల్‌కు గవర్నర్ వచ్చిన సందర్భంలోనూ వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు హాజరుకాకపోవడం గమనార్హం.
హన్మకొండ 'హరిత'లో గవర్నర్
గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం జాతర పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం హన్మకొండకు చేరుకున్నారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో బస చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, ఆర్డీఓ వాసుచంద్ర, ఏసీపీ జితేందర్‌రెడ్డి, హరిత కాకతీయ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ కుమారస్వామి, హన్మకొండ తహసీల్దార్ రాజ్‌కుమార్ తదితరులు ఆమె వెంట ఉన్నారు.