Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రోడ్ల కోసం రూ.93,656 కోట్లు ఇచ్చాం
- ఆరేండ్లలో 99 శాతం జాతీయ రహదారులు పెరిగాయి
- రీజినల్ రింగ్‌రోడ్డుతో మారనున్న రాష్ట్ర రూపురేఖలు
- ఉపాధి కల్పనా పెరుగుతుంది : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 'మిగతా ప్రాంతాల్లో కంటే ఇక్కడ ఉత్పత్తి వ్యయం ఎక్కువ. ఇతర ప్రాంతాల నుంచి ముడిసరుకు తీసుకొచ్చి ఉత్పత్తి చేయడం భారం. అలా తయారు చేసినా ఎవరైనా ఎక్కువ ధర పెట్టి కొంటారా?' అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం(ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మినహాయింపు) ఇప్పటి దాకా కేంద్రంలోని తమ ప్రభుత్వం రూ.93,656 కోట్లను ఖర్చుపెట్టిందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2014 ముందు వరకు 2,511 కిలోమీటర్లమేర జాతీయ రహదారులుంటే ప్రస్తుతం వాటి విస్తీర్ణం 4,994 కిలోమీటర్లకు చేరిందనీ, గత ఆరేండ్లలో 99 శాతం మేర పెరిగిందని వివరించారు. ఒక్క పెద్దపల్లి జిల్లా మినహా అన్ని జిల్లాల హెడ్క్వార్టర్లను అనుసంధానిస్తూ హైవేలను నిర్మించామని చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి 40, 50 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ చుట్టూతా నిర్మించబోయే రీజినల్ రింగ్‌రోడ్డు తెలంగాణ ముఖచిత్రాన్నే మార్చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ తెలంగాణలో హైవేల నిర్మాణానికి రూ.31,624 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఏదేశంలోనూ లేని విధంగా మన దేశంలో ప్రతిరోజూ కొత్తగా 37 కిలోమీటర్ల జాతీయ రహదారులను వేయిస్తున్నామనీ, ఇది దేశ రవాణా, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్నాయని చెప్పారు. రోడ్డు సేప్టీలో భాగంగా జాతీయ రహదారులపై నిత్యం ప్రమాదాలు జరిగే 378 ప్రాంతాలను గుర్తించి నివారణకు అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్- బెంగుళూరు హైవే(ఎన్‌హెచ్44)ను ఆరులైన్ల సూపర్ ఇన్ఫర్మేషన్ రోడ్డుగా తీర్చిదిద్దుతున్నామనీ, పెట్రోల్‌పంపులు, ఆస్పత్రులు ఎంత దూరంలో ఉన్నాయో చెప్పే టెక్నాలజీని తీసుకురాబోతున్నామని వివరించారు. గతిశక్తి పథకం కింద తెలంగాణలోని రోడ్లకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. షోలాపూర్-కర్నూల్-చెన్నై మధ్య ఆర్థిక కారిడార్, హైదరాబాద్-విశాఖ మధ్య ఇంటర్ కారిడార్, హైదరాబాద్-రాయచూర్ మధ్య ఎకనామిక్ కారిడార్, ఇండోర్-హైదరాబాద్ మధ్య ఇంటర్కారిడార్, నాగపూర్-విజయవాడ మధ్య ఎకనామికల్ కారిడార్‌తో పాటు మంచిర్యాల- విజయవాడ రోడ్లను ప్రత్యేకంగా నిధులను వెచ్చించి అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. 347 కిలోమీటర్ల మేర హైదరాబాద్ చుట్టూతా నిర్మించబోయే రీజినల్ రింగురోడ్డు నిర్మాణభారాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పారు.
అయితే, భూసేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులు భరించాల్సి ఉంటుందని చెప్పారు. మొదట ఉత్తరభాగం సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నిర్మిస్తామనీ, ఆ తర్వాత చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకూ దక్షిణ భాగాన్ని పూర్తిచేస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల 4.85 కోట్ల పనిదినాలు పేదలకు దక్కుతాయని చెప్పారు. ఎన్హెచ్ఏఐ చీఫ్జనరల్ మేనేజర్, రీజనల్ ఆఫీసర్ ఎ.కృష్ణప్రసాద్, డిప్యూటీ మేనేజర్ కీర్తి భరద్వాజ్, ఎమ్ఓఆర్టీహెచ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుభోద్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.