Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానసిక, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాం
- ప్రగతి భవన్‌ను ముట్టడించిన ఆవాజ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉర్దూమీడియం ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆ సంఘంఆధ్వర్యంలో ఉర్దూ మీడియం ఉపాధ్యాయ అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్బంగా అబ్బాస్ మాట్లాడుతూ 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న 535 ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను ఎందుకు భర్తీ చేయటం లేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరేండ్లుగా వారి జీవితాలతో సర్కారు ఆడుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మానసిక, ఆర్థిక సమస్యలతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. అర్హత ఉన్నా అవకాశం కల్పించకపోవటమనేది సర్కార్ నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. మరో పక్క పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన రీతిలో ఉపాధ్యాయులు లేరన్నారు. 900 పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, కేవలం 365 పోస్టులు మాత్రమే భర్తీ చేసిందన్నారు. మిగతా 535 పోస్ట్‌లు పెండింగ్‌లో పెట్టిందని గుర్తుచేశారు. పరిక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థులు ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ విద్య లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న సర్కార్ తక్షణం పెండింగ్‌లో ఉన్న ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ మీడియం టీఆర్టీ 2017 పోరాట కమిటీ అధ్యక్షులు మోహిజ్, షారూఖ్, ఫర్జానా తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.