Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిజాబ్ పేరుతో రెచ్చగొడుతున్న కాషాయమూకలు
- సంఘటిత ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పిలుపు
- ఉత్తేజంగా టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తొలుత ఆహారపు అలవాట్ల పేరుతోనూ, ఇప్పుడు దుస్తుల పేరుతోనూ దాడులు చేస్తున్నదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. కర్నాటకలో హిజాబ్ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టటం ద్వారా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని కాషాయమూకలు భావిస్తున్నాయని అన్నారు. సమకాలీన పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలనీ, చైతన్యవంతంగా ఆలోచించాలని సూచించారు. తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటీవ్స్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్‌యూ) రాష్ట్ర నాలుగో మహాసభలు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉత్తేజభరితంగా ప్రారంభమయ్యాయి. టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి మురళి ఆ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రారంభసభలో నర్సిరెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచంలోని వనరులను ప్రజలందరి వినియోగంలోకి తేవాలని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను తెల్లజాతి పోలీసు ఊపిరాడకుండా చంపాడని గుర్తు చేశారు. ట్రంప్ వర్ణవివక్షతను పాటించి అహంకారంతో గెలవాలకున్నా అక్కడి ప్రజలు బైడెన్‌కు మద్దతుగా నిలిచారని అన్నారు. అమెరికాలో నల్లజాతీయుల తరహాలోనే భారత్‌లో ముస్లింమైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని వివరించారు. సంప్రదాయాల ముసుగులో అభివృద్ధి కుంటుపడుతున్నదని చెప్పారు. ప్రజలు, కార్మికులు దోపిడీకి గురవుతున్నారని అన్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర పరిస్థితులు అందరి కుటుంబాలపైనా, వ్యక్తిగత జీవితాలపైనా ప్రభావం చూపుతాయన్నారు. కార్మికవర్గం హక్కులను మోడీ సర్కారు కాలరాస్తున్నదని విమర్శించారు. దేశ సంపద, ఆస్తులు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తున్నాయని చెప్పారు. కార్మికులు సంఘటితం కాకుండా పాలకులు వర్ణ వివక్షతను, కుల, మత విద్వేషాలను, ప్రాంతీయ, సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేయాలని సూచించారు. అవిశ్రాంత పోరాటం వల్లే వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. రైతాంగం స్ఫూర్తితో కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలనీ, అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
మార్చి 28,29 తేదీల్లో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి : రమేష్ సుందర్
కేంద్రంలో బీజేపీ సర్కారు అనుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వచ్చేనెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఎఫ్ఎంఆర్ఏఐ అధ్యక్షులు ఆర్ రమేష్ సుందర్ పిలుపునిచ్చారు. ఫార్మారంగంలో యాజమాన్యాల ఆగడాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా మేడీ సర్కార్ ఆరోగ్యరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించిందని అన్నారు. బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, 1.5 శాతం నిధులే కేంద్రం ప్రతిపాదించిందని వివరించారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వెంకట్రామయ్య మాట్లాడుతూ హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఉన్నా సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మెజార్టీ, మైనార్టీ మతం పేరుతో దేశాన్ని నిలువునా మోడీ సర్కారు చీల్చుతున్నదని ఏఐఐఈఏ నాయకులు పివిఎన్ఎస్ రవీంద్రనాథ్ విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ మాట్లాడుతూ ప్రజాధనంతో అభివృద్ధి చేసిన ప్రభుత్వరంగ సంస్థలను ఎన్ఎంపీ పేరుతో హోల్‌సేల్‌గా కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నదని అన్నారు. కార్మిక కోడ్లను రద్దు చేయకుంటే ఆ వర్గానికి హక్కులుండబోవని చెప్పారు. టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి మురళి అధ్యక్షతన జరిగిన ప్రారంభసభలో ప్రధాన కార్యదర్శి ఐ రాజుభట్, ఎఫ్ఎంఆర్ఏఐ కార్యదర్శి కె సునీల్‌కుమార్, టీఎంఎస్‌ఆర్‌యూ ఉపాధ్యక్షులు జి విద్యాసాగర్, కోశాధికారి సిహెచ్ భానుకిరణ్, రాష్ట్ర కార్యదర్శులు పివిఎస్ఏ ప్రసాద్, దొంతుల శ్రీనివాస్, కె ఐలయ్య, సయ్యద్ సిద్ధికి తదితరులు పాల్గొన్నారు.
మోడీ సర్కారు విధానాలపై పోరాటం
మోడీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న కాలంలో ఐక్య పోరాటాలు చేపట్టాలని టీఎంఎస్‌ఆర్‌యూ సంయుక్త కార్యదర్శి ఎ నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను, ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని ఖండించారు. కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న ఈ విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.