Authorization
Sat March 29, 2025 01:08:07 pm
- ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం
- రౌండ్‌టేబుల్‌లో హరగోపాల్, దామెదర రాజనర్సింహ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలోనూ, రాష్ట్రంలోనూ మీడియా స్వేచ్ఛను కార్పొరేట్ శక్తులు నియంత్రిస్తున్నాయని రౌండ్‌టేబుల్‌లో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'మీడియా స్వేచ్ఛపై కార్పొరేట్ ఆధిపత్యం-సమాజంపై ప్రభావం' అనే అంశంపై తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ దేశంలో పత్రికలు సంపూర్ణ స్వేచ్ఛ అనుభవించిన రోజులు తక్కువేనన్నారు. పత్రికా స్వేచ్ఛ అంటే ప్రజల సమస్యలపై చర్చించడమేనని చెప్పారు. పత్రికలు చదివే పేదలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. టీవీలు మాత్రం గుడిసెల్లోకి వచ్చాయనీ, ఇది ఎంతో ప్రమాదరమైందని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 తర్వాత ఇది ఉంటుందా? లేదా? అన్న అనుమానం ఉందన్నారు.తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రు హయాంలోనూ ఆ ప్రభుత్వాన్ని పత్రికలన్నీ ప్రశ్నించిన దాఖలాలున్నాయన్నారు. అలా రాస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నదని నెహ్రు చెప్పేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం కార్పొరేట్లు తమ ఆస్తులను కాపాడుకునేందుకే పత్రికలు, మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయని చెప్పారు. దీని ఫలితంగా మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ సమాజంలో సిద్దాంతాలు లేకుండా పోయాయనీ, స్వార్థం పెరిగి లాలూచీ పడి అవకాశవాదాన్నే కొందరు సిద్దాంతంగా చేసుకుంటున్నాయని చెప్పారు. మీడియాస్వేచ్ఛకు భంగం కలిగితే నియంతృత్వం వైపు పోతుందన్నారు. జర్నలిజం విలువలు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం బలహీనమై... పార్టీలు లాలూచీ పడితే అక్కడ ప్రజాస్వామ్యం ఉండదన్నారు.
ఎన్నికల అధికారిగా రజత్ కుమార్ 21 లక్షల మందికి ఓటు హక్కు కాలరాశారని విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్నది అవినీతి కాదనీ, భారీ దోపిడీ అని చెప్పారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నాయన్నారు. వ్యవస్థలన్నీ కార్పొరేట్ల గుప్పిట్లోకి పోయాయని చెప్పారు. రాష్ట్రంలో డబ్బు, పోలీస్, యంత్రాంగం అన్నింటిలోనూ తలదూర్చడంతో ప్రతిపక్షం విఫలమవుతున్నదన్నారు. దొర తన వర్గానికి రాజ ముద్ర వేసేందుకే ధరణి వెబ్సైట్ రూపకల్పన చేశారని విమర్శించారు. మన అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఏ అధ్యక్షులు కోదండరాం, సీనియర్ సంపాదకులు కె శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ నాయకులు గాదె ఇన్నయ్య, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి పీవీ శ్రీనివాస్, ఆప్ నేత ఇందిరాశోభన్, పీవోడబ్య్లూ నేత సంధ్య, కప్పర ప్రసాదరావు, వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌రెడ్డి, సాధిక్ తదితరులు మాట్లాడారు.