Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యురేనియం కోసం అడవి బిడ్డలను తరలించేందుకు యత్నం
- కొల్లంపేట, కొమ్మనపేటలో అలజడి
- అంగీకార పత్రాలు రాయించుకునే పనిలో అటవీ అధికారులు
- చావనైనా చస్తాంగానీ అడవిని వీడమంటున్న ఆదివాసులు
- గిరిజన, గిరిజనేతరుల మధ్య చిచ్చు
అడవిలో పుట్టాం, అడవిలోనే చస్తాం. ఉన్నట్టుండి మాపై మీకెందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఆకలైతే అన్నం పెట్టారా ?.. రోగం వస్తే ఆస్పత్రిలో చేర్పించారా ?.. మా భాష వేరు, మా బతుకు వేరు. ఏనాడూ మీపై ఆధారపడి బతకలేదు. అడవి తల్లే మాకు అన్నీ ఇచ్చింది. మీతో మాకు సంబంధం లేదు. అయినా అడవిని వదిలి బస్తికి రమ్మనడంలో ఆంతర్యమేమిటి ?.. మీరిచ్చే లక్షలు మా బతుకులను బాగు చేయవు.. యురేనియం కోసమే మమ్మల్ని పంపే కుట్రలకు పాల్పడుతున్నారా ?.. అడవిలో ఉన్నప్పుడే ఆదుకోలేదు. ఇక అడవిని వదిలితే బతకనిస్తారా?'' అంటూ కొల్లంపేటకు చెందిన గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
అడవి గడప దాటని ఆదివాసులను తమ స్వప్రయోజనాల కోసం పాలకులు అటవీ శాఖ సాయంతో తరలించే కుట్రలు చేస్తున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర వసంతాలు కావస్తున్నా నేటికీ అడవి బిడ్డల ఆకలి తీర్చింది లేదు.. వారేం తింటున్నారో.. ఎలా బతుకుతున్నారో.. అంతా ఆ అడవి తల్లికే తెలుసు. అంతరిస్తున్న ఆదిమ జాతి మనుగడ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడిందీ లేదు.. ఉన్నట్టుండి ఇప్పుడు వారిపై పాలకులు, అధికారులకు వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చింది. లక్షల రూపాయలు ఇస్తాం.. బస్తీకి వెళ్లిపోవాలంటూ బలవంతం చేస్తున్నారు. పాలకులు యురేనియం కోసం చెంచులను అడవి నుంచి తరలించే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గూడేల్లో అటవీ అధికారులు రహస్యంగా అంగీకార పత్రాలు రాయించుకునే పనిలో నిమగమయ్యారు. ఈ క్రమంలో నేటికీ ఆహార సేకరణ దశలోనే ఉన్న చెంచులు చావనైనా చస్తాంగానీ అడవిని వదిలేది లేదంటున్నారు. అయినా పాలకులు, అధికారులు మొండి పట్టు వీడటం లేదు. అటవీ ప్రాంతంతో పాటు వన్యప్రాణుల సంరక్షణలో భాగమైన చెంచులను తరలిస్తే భవిష్యత్ అంధకారం కానుంది.
నాగర్కర్నూల్ జిల్లాలో అచ్చంపేట, బల్మూరు, పదర, మన్ననూరు, కొల్లాపూర్ లింగాల తదితర మండలాల్లో వటవర్లపల్లి, సార్లపల్లి, పులిచింతలబైలు, మల్లాపూర్, అప్పాపూర్, బౌరాపూర్, రాంపూర్, సంగడి గుండాల, మేడిమలక్కల, ఈర్లపెంటతో పాటు దాదాపు 112 చెంచుపెంటలున్నాయి. 2,630 కుటుంబాలుండగా 9500 మంది చెంచులున్నారు. ఆహార సేకరణతో పొట్ట నింపుకుంటున్న చెంచులు నేటికీ అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒకవైపు అటవీ సంరక్షణ, మరోవైపు వన్యప్రాణుల పరిరక్షణకు పాటుపడుతూ జీవన గమనాన్ని నెట్టుకొస్తున్నారు. నేటికీ వీరు విద్య, వైద్యానికి అందనంతం దూరంలో ఉన్నారు.
యురేనియం కోసమే తరలింపు ?
భారతదేశంలోనే పెద్ద పులుల అభయారణ్య ప్రాంతంగా నల్లమల ప్రసిద్ధి. వీటి పరిధిలో యురేనియం నిక్షేపాలున్నాయని గుర్తించిన పాలకులు వెలికి తీసే కుట్రలు చేస్తున్నారు. రహస్యంగా అడవిలో రాచబాట వేశారు. కానీ, ఆదివాసులు, ప్రజాసంఘాల పోరాటాల ఫలితంగా యురేనియం తవ్వకాల కోసం బోర్లు వేశాక నెమ్మదించారు. మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టారు. మన్ననూర్ దాటిన తర్వాత శ్రీశైలం రహదారిలోని కొల్లంపెంట బేస్ క్యాంపు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో కొల్లంపెంట గూడెం ఉంది. ఈ ప్రాంతంలో నిత్యం పెద్ద పులులు సంచరిస్తాయి. అక్కడ వాటితో సహజీవనం చేసే చెంచులను.. అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల రక్షణ ముసుగులో అక్కడి నుంచి తరలించేందుకు కుట్రలు పన్నుతున్నారు. వీరి వెనుక బడా పారిశ్రామికవేత్తలు, నేతలున్నట్టు సమాచారం. ఇక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్తే అభివృద్ధి చెందుతారని, వచ్చిన వారికి ఆర్థిక సాయం కూడా చేస్తామని నమ్మించి వారం కిందట రహస్యంగా వారి నుంచి సంతకాలు సేకరించారు. వారికి మద్యం తాగించి సంతకాలు చేయించుకున్నట్టు సమాచారం. శ్రీశైలం వెళ్లే దారిలో ఉండే పరహాబాద్ దగ్గర గల కొమ్మనపెంట చెంచులను కూడా ఇలాగే తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
చెంచులకు అడవిలోనే రక్షణ..
శంకర్ నాయక్- గిరిజన సంఘం జిల్లా నాయకులు- నాగర్కర్నూల్
చెంచులకు అడవిలోనే రక్షణ ఉంటుంది. అడవి జీవితానికి అలవాటుపడిన వారిని పాలకులు తమ స్వప్రయోజనాల కోసం తరలించడం సరికాదు. వారు జన జీవనంలో ఉండలేరు. అడవిని నాశనం చేసే మాఫియాను వదిలి.. అడవి బిడ్డలను ఆగం చేయాలనుకోవడం దుర్మార్గం. ప్రభుత్వాలు ఇలాంటి పనులు మానుకోవాలి. లేకుంటే చెంచులను సమీకరించి ఉద్యమిస్తాం.
లక్షలు మా బతుకులను బాగుచేయవు..
మా తాతల కాలం నాటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. అడవిని నమ్ముకుని బతుకు లీడుస్తున్నాం. తమను ఇక్కడి నుంచి వెళ్లగొట్టే కుట్రలు చేస్తున్నారు. చావనైనా చస్తాంగానీ అడవిని మాత్రం వదలం. అడవిని వదిలితే లక్షలిస్తామన్నారు. కానీ ఆ లక్షలు మా బతుకులను బాగు చేయలేవు.
- లింగయ్య- కొల్లంపెంట- అమ్రాబాద్ మండలం