Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంగళహాట్ పీఎస్‌లో నమోదు
- రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్ 505, 171(సీ), 171(ఎఫ్)తో పాటు ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 123, 125 కింద కేసులను నమోదు చేసినట్టు మంగళహాట్ సీఐ రవీందర్ రెడ్డి తెలిపారు. యూపీలోని బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేవారిని బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ ఇటీవల రాజాసింగ్ ఒక వివాదాస్పద ప్రకటన చేశారు. దానిపై రాష్ట్రంలోనేగాక, దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాలు నిరసనను వ్యక్తం చేశాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రాజా సింగ్‌ను వివరణ కోరుతూ ఈనెల 19 వరకు గడువు ఇచ్చింది. అయితే, గడువు దాటినప్పటికీ రాజాసింగ్ నుంచి ఎలాంటి వివరణా రాకపోవడంతో ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను సీఈసీ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చెందిన అధికారి రాజాసింగ్‌పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించి రాజాసింగ్‌పై కేసులు నమోదు చేశామని సీఐ రవీందర్ రెడ్డి తెలిపారు. యూపీ ఎలక్షన్‌పై ఆయన చేసిన ప్రకటన వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి అక్కడ నుంచి వచ్చిన నివేదిక మేరకు తదుపరి చర్యను రాజాసింగ్‌పై తీసుకుంటామని సీఐ చెప్పారు.