Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యురేనియం తవ్వకాలు నిలిపేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
యురేనియం కోసం ఆదివాసీలను అడవుల నుంచి తరలించడాన్ని తక్షణం నిలుపుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వన్యప్రాణులతో సహజీవనం చేస్తూ అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలను, వన్యప్రాణుల రక్షణ ముసుగులో యురేనియం కోసం బలవంతంగా అంగీకార పత్రాలు రాయించుకుని వారిని అడవినుండి వెళ్ళగొట్టేందుకు జరుగుతున్న కుట్రను తమ పార్టీ ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అడవిని వదిలితే బ్రతకలేమని ఆందోళన చెందుతున్న గిరిజనులకు రక్షణ కల్పించాలని కోరారు. గతంలో అచ్చంపేట, బల్మూరు, పదర, మన్నూరు, కొల్లాపూరు, లింగాల మండలాల్లో అణుశక్తి శాఖ ద్వారా బోర్లు వేసి యురేనియం ఉన్నట్లు గుర్తించారని వివరించారు. తవ్వకాలకు వ్యతిరేకంగా అక్కడ నివసించే చెంచులు, ప్రజలు, ప్రజాసంఘాలు ఆందోళనలకు దిగడంతో 2019లో ఆ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసారని చెప్పారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను జరపరాదని 2019 సెప్టెంబర్ 16న శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బడా పారిశ్రామికవేత్తల వత్తిడితో ''పెద్దపులుల అభయారణ్యం''లో తిరిగి తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ఆ ప్రాంతంలో మూడువేల కుటుంబాలతో కూడిన 115 చెంచుపెంటలు ఉన్నాయన్నారు. యురేనియం తవ్వకాలు వీరందరినీ నిరాశ్రయులను చేస్తాయనీ, దీనివల్ల వెలువడే రేడి యేషన్ వల్ల 2,500 చ.కి.మీ., మేర నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ లలో నివసిస్తున్న గిరిజనుల ప్రాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పులులకు ప్రత్యేక రక్షణ జోన్‌గా ఉండి, వన్యప్రాణు లను కాపాడుతున్న ప్రాంతంలో తవ్వకాల వల్ల జంతువుల ప్రాణాలకు, వక్షాలకు రక్షణ లేకుండా పోతుందనీ, ఇది పర్యావరణానికే పెనుముప్పు అని చెప్పారు. యురేనియం పరిశీలనా ప్రయోగాలు, తవ్వకాలను తక్షణమే నిషేధించాలని, ఆ ప్రాంతంలో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టరాదని కేంద్ర ప్రభుత్వాన్ని తమపార్టీ డిమాండ్ చేస్తున్నదని వివరించారు. ఈ తవ్వకాల వల్ల నష్టపోయే గిరిజనులు, ప్రజలు ఇప్పటికే పెద్దఎత్తున ఉద్యమాలలోకి వస్తున్నారనీ, అది మరింత ఉధతం కాకముందే ప్రభుత్వం తన ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.