Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీకార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి
- ఇందిరాపార్కు వద్ద టీఈఏ నిరసన దీక్షలో పలువురు వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 317ని వెంటనే రద్దు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్ చేయాలనీ, వారిపై అధికారులు, ప్రజాప్రతినిధుల వేధింపులను అరికట్టాలని కోరారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్(టీఈఏ) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరసన దీక్ష చేపట్టారు. '70 మందికి మించొద్దు' అన్న పోలీసుల ఆంక్షల నడుమ, ప్రత్యేక అనుమతితో మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 గంటల వరకు కొనసాగింది. ఉద్యోగులు తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆప్‌నేత ఇందిరాశోభన్ మాట్లాడుతూ..ప్రశ్నిస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. మెజార్టీ ఉద్యోగ సంఘాల నేతలు తమ సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ఉద్యోగులను చెట్టుకొకరిని.. పుట్టకొకరిని వేసి ఏం సాధించాలనుకుంటున్నదని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కారు భజన, తొత్తు ఉద్యోగ సంఘాల వల్లనే నేడు ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. ఉద్యోగుల బాధలు సంఘాల నేతలకు పట్టవా? అని ప్రశ్నించారు. సంఘాల పేర్లతో వ్యాపారాలు చేస్తున్న, స్వప్రయోజనాలు నెరవేర్చుకుంటున్న నేతల కుతంత్రాలను ఉద్యోగులు అర్థం చేసుకుని మసలుకోవాలని పిలుపునిచ్చారు. టీఈఏ రాష్ట్ర అధ్యక్షులు సంపత్‌కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మాట్లాడుతూ.. ఉద్యోగులందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు తమ అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే గొప్పగా ఉండేదనీ, నేడు అమ్మో సర్కారు కొలువా? వద్దు బిడ్డా..చచ్చిపోతారనే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామకార్యదర్శుల ఆత్మహత్యలపై సీబీఐ విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులంతా కలిసి ఉంటేనే విజయం దక్కుతుందనీ, విడిపోతే పడిపోయి ఓడిపోతారని అన్నారు. జీవో 317వల్ల నిరుద్యోగులకూ పెద్ద నష్టం చేకూరుస్తున్న తీరును వివరించారు. ఉపాధి హామీచట్టంలో తొలగించబడిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి నియమించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గించాలని కోరారు. వీఆర్ఓ, వీఆర్ఏలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 33 నెలల పీఆర్సీ బకాయిలు, 18 నెలల డీఏ. ఏరియల్స్‌ను చెల్లించాలని కోరారు. బిశ్వాల్ కమిటీ సూచించిన ఒక లక్షా 92 వేల ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టి ఉద్యోగుల పై ఉన్న తీవ్ర పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించి ఉద్యోగికి భద్రత కల్పించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సదానందంగౌడ్ మాట్లాడుతూ..ఒక ప్రణాళికాబద్ధంగా బదిలీల ప్రక్రియ చేపట్టకపోవడం వల్లనే రాష్ట్రంలో నేడు ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో టీఈఏ మహిళా విభాగం అధ్యక్షులు జి.నిర్మల, కోశాధికారి జి.బాలస్వామి, చీఫ్ కోఆర్డినేటర్ ఆనంద్ యాదవ్, కోఆర్డినేటర్ బొడ్డు ప్రసాద్, చీఫ్ కన్వీనర్ భోగ శ్రీనివాస్, సంయుక్త ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా, కన్వీనర్లు వేముల రాధికారెడ్డి, డి.చక్రపాణి, కార్యనిర్వాహక అధ్యక్షులు జయలక్ష్మి, పంచాయతీ సెక్రటరీల ఫోరం అధ్యక్షులు కరుణాకర్, మెడికల్ అండ్ హెల్త్ ఫోరం అధ్యక్షులు భరత్ సత్యనారాయణ, నాయకులు లక్ష్మణాచారి, శశికాంత్, నిరంజన్, ఖాసింబాబా, తదితరులు పాల్గొన్నారు.