Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో నెంబర్ 317తో ఉద్యోగుల ఇక్కట్లు
- ఆడబిడ్డలతో కంట కన్నీరు పెట్టిస్తున్న సర్కారు
- కొన్ని శాఖల్లో ఆప్షన్లు కూడా తీసుకోని దౌర్భాగ్యం
- న్యాయం చేయాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి
- సొంతజోన్ను కాదని మల్టీజోన్లకు బదిలీలతో సెలవుల్లోకి ఉద్యోగులు
- అవకాశమున్నా కనుకరించని వైనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీవో నెంబర్ 317 అంశం రాష్ట్రంలో ఇంకా రగులుతూనే ఉన్నది. అంతా సర్దుకుంది..ఏదో కొందరికే ఇబ్బంది అని సర్కారు చెబుతున్నప్పటికీ...'భయంతో నోర్మూసుకుని విధుల్లో చేరాం..ఎవరి బాధలు వారివే' అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవర్ని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. ఆడబిడ్డలను పలుకరిస్తే కంట కన్నీళ్లు దుముకుతున్నాయి. ఉన్నతాధికారుల సవాలక్ష ఆదేశాలను పాటిస్తూ...ప్రజాప్రతినిధుల వేధింపులను తట్టుకుంటూ క్షేత్రస్థాయిలో రెండేండ్లపాటు పనిచేసిన గ్రామపంచాయతీ కార్యదర్శులనూ సర్కారు నేడు నడిరోడ్డున పడేసింది. 'సీనియర్లు ఆప్షన్లు పెట్టుకున్నారు కాబట్టి..మీ అవసరం లేద'ంటూ గొడ్డుచాకిరీ చేయించుకున్న సర్కారు తేల్చేసింది. ఒంటరి మహిళలనీ తెలిసినప్పటికీ వందలకిలోమీటర్ల దూరంలో విసిరిపాడేసింది. సొంతజోన్లో ఖాళీలున్నా..మల్టీజోన్‌లోకి బదిలీ చేయడం వివాదాస్పదమవుతున్నది. కొన్ని శాఖల్లోనైతే ఆప్షన్లు కూడా తీసుకోని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. స్థానికుడు సొంతజిల్లాలో స్థానికేతరుడయ్యే దుస్థితిని కల్పించడంపై ఉద్యోగులంతా ఒకింత ఆవేదనలో ఉన్నారు. న్యాయం చేయండి...మా కుటుంబాలను కలపండి..కుటుంబాలే విడిపోతే మెరుగైన సమాజం ఎలా నిర్మితం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. కన్నీటిగాథలే..ఉద్యమ పిడికిలై సర్కారుపై ఎక్కుపెట్టే పరిస్థితిని తీసుకురావొద్దని హెచ్చరిస్తున్నారు. ఇందిరాపార్కు వద్ద జరిగిన సందర్భంగా జీవోనెంబర్ 317 బాధిత ఉద్యోగులు నవతెలంగాణతో తమ బాధల్ని పంచుకున్నారు.
ప్రమోషన్ తీసుకోవడమే పాపమైంది..
అరె ప్రమోషన్ తీసుకోవడమే పాపమైంది. 18 ఏండ్ల సీనియారిటి. అటెండర్ నుంచి సీనియర్ అసిస్టెంటు దాకా పదోన్నతి పొందుతూ వచ్చిన. జనవరి 29 2021లో ఉద్యోగోన్నతి పొందా. ఇప్పుడు నేడు జూనియర్ని అంట? ఏసిన కాడ్కి పోవాలంట? నాకు ప్రమోషన్ ఏమొద్దు డిమోషన్ చేయండి. సొంత జిల్లాకు పంపండి అంటే అట్ల పంపరంట. డిమోషన్ తీసుకున్నా నిజామాబాద్‌లోనే చేయాలంట. ఇదెక్కడి న్యాయం. నా కొడుకు 72 శాతం వికలాంగుడు. మాబాబుకి ఆరోగ్యం బాగుండని టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలోని అధికారులందరికీ తెలుసు. వాడ్ని చూసుకోవడమే పెద్ద తలనొప్పి. నా భార్యకు వెన్నుపూసలో డిస్క్ సమస్యలున్నాయి. ఆమెనూ ఆస్పత్రుల చుట్టూ తిప్పాలి. ఈస్ట్‌మారేడుపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ఉండేటప్పుడు జాబ్ చేసుకుంటూ ఆస్పత్రుల చుట్టూ తిప్పేటోణ్ని. నిజామాబాద్ నుంచి జర్నీ చేయాలంటే మస్తు ఇబ్బంది అయితాంది. పొద్దుగాల ఆరింటికి బయలుదేరితే ఇంటికొచ్చేసరికి రాత్రి 9:30 అవుతున్నది. నాకొడుక్కి సడన్‌గా పెయిన్ వచ్చి ఇబ్బంది అయితే నిజామాబాద్ నుంచి ఉరుకొచ్చి ఆస్పత్రికి తీసుకుపోవుడు సాధ్యమైతదా? జూనియర్ అసిస్టెంట్ అయితే హైదరాబాద్‌లో ఉండేవాణ్ని. సికింద్రాబాద్‌లోని సొంతింటికాడి నుంచి పోయి వచ్చేవాణ్ని. జిల్లాలోని వేరే కాలేజీకో..జోన్లోకి కాలేజీకో బదిలీ చేస్తే కండ్లు మూసుకునిపోయేవాణ్ని. మల్టీజోన్‌లో వేయడమేంటి? ప్రమోషన్ ఇస్తే 18 ఏండ్ల సీనియారిటీ పోయినట్టేనా? ఇదేం పద్ధతి. దండం పెడుతున్నా. మా బాబు మొఖం చూసి సంగారెడ్డిలేనో? మేడ్చల్ జిల్లాకో బదిలీ చేయండి. డిమోషన్‌కు కూడా సిద్ధమే. జాబ్ చేయాల్నో..బాబును, నా భార్యను చూసుకోవాలో అర్థంకాక పిచ్చెక్కుతున్నది. మెడికల్ లీవ్ పెట్టేశా. మానసికంగా కుంగిపోతున్నా.
- కొండరాజు, నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల సీనియర్ అసిస్టెంట్
ఖాళీలున్నా..తీసుకుపోయి నిజామాబాద్‌లో వేయడమేంటి?
ఉద్యోగంలో ఉన్న సమయంలో నాన్న చనిపోతే మానవతా దృక్పథంతో అప్పటి ప్రభుత్వం 2011లో ఆయన స్థానంలో పోస్టు ఇచ్చింది. ఆ తర్వాత రామంతాపూర్, మాసబ్‌ట్యాంకు పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేశా. నా సొంత జిల్లా హైదరాబాద్‌నే. ఇప్పుడు నిజామాబాద్‌కు బదిలీ చేశారు. చార్మినార్ జోన్ నుంచి బాసర జోన్‌కు బదిలీ చేయడం అన్యాయం. అయినా మా జోన్లోనే 13 లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 28 ఖాళీగా ఉన్నాయి. అయినా అక్కడకు ఎందుకు పంపారో అర్థం కావడం లేదు. నాకు ఇంకా 30 ఏండ్ల సర్వీస్ ఉంది. ఇప్పుడు జీవితాంతం బాసర జోన్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇద్దరు చిన్నపిల్లలున్నారు. చెల్లెనూ నేనే చూసుకోవాలి. ఏం అర్థం కాక సెలవు పెట్టుకున్నా.
- సందీప్, నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల లైబ్రేరియన్
సీఎం సారూ నీ బిడ్డకైతే ఇట్లనే చేస్తవా?
నా పేరు విజయ. 11 ఏండ్ల పాప ఉంది. ఒంటరి మహిళను. ఒంటరి మహిళగా సమాజంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. నాన్న తోడ్పాడు, సహకారంతో కష్టపడి చదివి 2012 డీఎస్సీ ద్వారా హిందీ పండిట్‌గా సెలక్టయ్యా. శంషాబాద్ జిల్లా ముచ్చింతల్ మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జాబ్ చేసేదాన్ని. లాంగ్‌స్టాండింగ్, సింగిల్ ఉమెన్ కోటాలో నివాసస్థలానికి దగ్గరగా బదిలీ కాకపోతుందా? అనే చిన్న ఆశతో కష్టాలెన్ని ఎదురైనా ఇన్నేండ్లు నెట్టుకొచ్చా. జీవో 317తో ఇప్పుడు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం దామర్చేడ్ పాఠశాలకు పంపారు. నేనుండే చోటు నుంచి అది 150 కిలోమీటర్లకుపైగా ఉన్నది. ట్రైన్లో వెళ్లడం కష్టంగా ఉంది. అసలే నేను ఆస్తమా రోగిని. నాలో నిత్యం ధైర్యం నూరిపోసే తండ్రి 2019లో క్యాన్సర్‌తో చనిపోయాడు. ఆ తర్వాత రెండు సార్లు నాకూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో అల్లాడాను. పాప సకాలంలో ఆంబులెన్స్‌కు ఫోన్ చేసి రప్పించింది కాబట్టే ప్రాణాలతో బయటపడ్డా. నాకు బదిలీ అయిన ప్రాంతంలో దుమ్మూధూళి ఎక్కువగా ఉంది. ఇటీవల రైలులో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక కిందపడిపోతే చుట్టుపక్కల టీచర్లు కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. కనిపించినోళ్లకల్లా నా బాధలు చెప్పుకుని అప్లికేషన్లు ఇచ్చిన. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పాప సికింద్రాబాద్ సెయింట్‌ఆన్స్‌లో ఆరో తరగతి చదువుతున్నది. ఇప్పుడు 70 ఏండ్ల అమ్మను ఎవరు చూసుకోవాలి? పాప చదువేం కావాలి? మానవత్వం ఉందా? చచ్చిందా? అందరిండ్లల్లో ఆడపిల్లలున్నారు కదా? మీ ఇంట్లోని తల్లో..బిడ్డో..ఎక్కడో దూరంగా జర్నీ చేసి వస్తే ఇల్లు ఆగం కాదా ? 150 కిలోమీటర్ల దూరం జర్నీ చేయలేక అక్కడే రూం తీసుకుని ఉంటే ఇంట్లోని పిల్ల,తల్లి ఆగం కాదా? ఇది అర్థం కావట్లేదా? ఉమ్మడి జిల్లాను ఎవరు విభజించమన్నారు? సర్వీస్ మొత్తం అక్కడే చేయాలంట. ఇదెంట్ల అండి? నా కడుపులో ఆవేదన రగులుతున్నది. ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. జర్నీచేయలేక సెలవు పెట్టుకున్నా. 317తో ఒంటరి మహిళలకు అన్యాయం చేయడం ఎంత వరకు సబబు? ఏమాత్రం సపోర్టు లేనోళ్లు ఎక్కడపోతరు? సీఎం సార్‌కు కూడా కూతురు ఉంది కదా! తనకే ఈ కష్టం వస్తే వదిలేస్తడా? చిన్నపిల్ల తల్లినైనప్పటికీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు దక్కిన ప్రతిఫలం ఇదా? ఇదేం అన్యాయం? సీఎం సారూ చేతులెత్తి వేడుకుంటున్నా దయచేసి నా సొంత జిల్లా మేడ్చల్‌కి పంపండంటూ భోరున విలపించింది.
- విజయ, టీచర్, దామరచేడ్ స్కూల్, బషీరాబాద్ మండలం, వికారాబాద్ జిల్లా
వితంతువు అని తెలిసీ..నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి బదిలీచేశారు...
నేను వితంతువుని. 15 ఏండ్లుగా నిలోఫర్ ఏఆర్టీ సెంటర్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేశా. ఇటీవల నిర్వహించిన టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలో స్టాఫ్‌నర్సు ఉద్యోగాన్ని పొందా. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఆరు నెలలు పనిచేశాను. ఇంతలోనే జీవో నెంబర్ 317 పిడుగు వచ్చి మీద పడింది. భర్తలేడు. బాబును, పాపను ఏడ ఉంచి పోవాలో అర్థంకాక అపార్ట్మెంట్లో ఇంట్లో పెట్టి పోతున్నా. డీహెచ్‌కు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఉస్మానియాలో ఎస్ఆర్ బుక్కులో, ఎల్పీసీలో పేరు కూడా ఎక్కలేదు. ఏవో సర్వీసు రూలంట ఇంకా జీతమొస్తలేదు. హైదరాబాద్ నుంచి రోజూ 140 కిలోమీటర్లు పోతున్న. మళ్లీ వస్తున్న. పిల్ల కుట్టకముందే కుళ్ల కుట్టిన చందంగా నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీ ఇంకా ప్రారంభమే కాలేదు. అక్కడ పనే లేదు. మమ్ముల్ని అక్కడ తీసుకునిపోయి పడేశారు. అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. రోజూ రానుపోనూ రూ.300 కిరాయి అయితున్నది. ఈ జీవో మా ప్రాణమీదకొచ్చింది. ఏం చేయాల్నో అర్థం కావట్లేదు. చావలనుకున్న. వితంతువులు, ఒంటరి మహిళలకు ఏమీ లేదు అంటున్నరు. జాబ్ వచ్చాక భర్త చనిపోతే వితంతువు అవుతరంట? అంతకుముందే భర్తలు చనిపోతే వితంతువులు, ఒంటరి మహిళలు కాకుండా పోతరా? ఇదేం న్యాయమండి. సీఎం సార్ వరకూ అన్ని విషయాలు పోవట్లేదు. కొందరు ఆయన వరకూ చేరకుండా అడ్డుకుంటున్నారు. సిటీలోని చాలా ఆస్పత్రుల్లో నర్సుల కొరత ఉంది..ఏదో ఒక ఆస్పత్రి బదిలీ చేయాలని సీఎంని వేడుకుంటున్నా.
- రమ, స్టాఫ్‌నర్స్