Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకుల ద్వారా నిధులు సేకరించాలని సర్కార్ ఉత్తర్వులు
- హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు అప్పులివ్వని బ్యాంకులు
- హెచ్ఎండీఏ నుంచి సగం నిధులు
- పనులు చేసేది పురపాలక, పట్టణాభివృద్ధి
- బల్దియా అప్పులు రూ.5వేలకోట్లపైనే..
- మహానగర పాలక సంస్థపై మరింత భారం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అప్పులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులతోపాటు కేంద్ర నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులను సైతం విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, ఫ్లైఓవర్లు, నాలాలు, మూసీపై బ్రిడ్జీల పేరుతో జీహెచ్ఎంసీ చేత అప్పులు చేయిస్తోంది. ఇప్పటికే ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ, జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల కోసం బాండ్లు, బ్యాంకు రుణాల ద్వారా రూ.5 వేల కోట్లకుపైనే అప్పులు చేసిన విషయం తెలిసిందే. మరో పక్క నాలాలు, డ్రెయినేజీల అభివృద్ధి కోసం రూ.10వేల కోట్లు అవసరమని గుర్తించిన ప్రభుత్వం రూ.858కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుంది. మిగిలిన నిధులను బ్యాంకు రుణాల ద్వారా సమీకరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటితోపాటు మూసీపై నిర్మించనున్న 15బ్రిడ్జీలకు అయ్యే ఖర్చులో సగం నిధులను బ్యాంకు రుణాల ద్వారా సేకరించాలని జీహెచ్ఎంసీని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. దీంతోపాటు రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్)లో నిధులు లేకపోవడంతో బ్యాంకులు సైతం అప్పులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.
మూసీపై రూ. 545కోట్లతో 15బ్రిడ్జీలు
రంగారెడ్డి జిల్లాల్లో పుట్టి హైదరాబాద్ నగరం నుంచి నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు వెళ్తున్న మూసీ, ఈసీ నదులపై రూ.545కోట్లతో 15 బ్రిడ్జీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో రూ.40కోట్లతో అఫ్జల్‌గంజ్ వద్ద ఐకానిక్ పాదచారుల వంతెన, రూ.52కోట్లతో హైలెవల్ బ్రిడ్జి, రూ.39కోట్లతో ఇబ్రాహీంబాగ్ కాజ్‌ను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి, రూ.32కోట్లతో సన్‌సిటీ. చింతల్మెట్లను కలుపుతూ ఈసీపై హైలెవ్ బ్రిడ్జి, రూ.32కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు, కిస్మత్పూర్ను కలుపుతూ ఈసీ నదిపై బండ్లగూడ జాగీర్ వద్ద హైలెవల్ బ్రిడ్జి, రూ.52కోట్లతో మూసారాంబాగ్ వద్ద మూసీపై హైలెవల్ బ్రిడ్జి, రూ.42కోట్లతో చాదర్ఘట్ వద్ద మూసీపై హైలెవల ్బ్రిడ్జి, రూ.35కోట్లతో అత్తాపూర్‌లో మూసీపై ఉన్న బ్రిడ్జీలకు సమాంతరంగా మరో రెండు బ్రిడ్జీలు నిర్మించాలని నిర్ణయించారు. రూ.42కోట్లతో ఉప్పల్ లేఅవుట్‌ను కలుపుతూ మూసీపై బ్రిడ్జి, రూ.39కోట్లతో మంచిరేవుల గ్రామం-నార్సింగిని కలుపుతూ మూసీపై హైలెవల్ బ్రిడ్జి, రూ.32కోట్లతో బుద్వేల్ వద్ద ఈసీ నదిపై ఐటీపార్కులు, సమాంతర రోడ్లను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి, రూ.42కోట్లతో హైదర్షాకోట్, రాందేవ్గుడను కలుపుతూ ఈసీపై బ్రిడ్జి, రూ.20కోట్లతో బుద్వేల్ వద్ద రెండో బ్రిడ్జి, రూ.35కోట్లతో ప్రతాపసింగారం, గౌరెల్లిని కలుపుతూ మూసీపై హైలెవల్ బ్రిడ్జి, రూ.11కోట్లతో మంచిరేవుల బ్రిడ్జిని కలుపుతూ లింకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.
నిధుల సేకరణ..
మూసీ, ఈసీ నదులపై నిర్మించనున్న 15బ్రిడ్జీల కోసం ప్రభుత్వం రూ.545కోట్లకు పరిపాలన ఆమోదం తెలుపుతూ జనవరి 29న జీఓ ఆర్టీ నెం.37ను విడుదల చేసింది. సగం నిధులను హెచ్ఎండీఏ నుంచి సేకరించాలని, మరో సగం నిధులను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవాలని నిర్ణయించింది. నిధులిచ్చేది హెచ్ ఎండీఏ, జీహెచ్ఎంసీ అయితే.. పనులు చేపట్టేందుకు ఏజెన్సీలను ఎంపిక చేసే బాధ్యత మాత్రం పురపాలక, పట్ణ ణాభివృద్ధి శాఖ చూసుకుంటుందని ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ బ్రిడ్జీల పనులను హెచ్ఆర్డీసీఎల్ ద్వారా చేపట్టాలని గతంలో నిర్ణయించారు. బ్యాంకు రుణాలను సేకరించడానికే హెచ్‌ఆర్‌డీసీఎల్‌ను ఏర్పాటు చేశారు. కానీ హెచ్ఆర్డీసీ ఎల్‌కు ప్రత్యేకంగా ఆదాయం లేకపోవడంతో రుణాలు ఇవ్వ డానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీంతోపాటు హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు పనులను అప్పగిస్తే సమస్యలొస్తాయని గుర్తించిన సర్కార్ నేరుగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో పనులు జరగనున్నాయని పేర్కొంది.
పుట్టెడు అప్పులు
జీహెచ్ఎంసీ నిర్వహించే పనులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.25వేల కోట్ల అంచనాతో ఎస్ఆర్డీపీ, రూ.1839 కోట్లతో సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ), రూ.1500 కోట్లతో లింక్ రోడ్ల నిర్మాణ పనులను చేయాలని నిర్ణయించింది. కానీ వీటికయ్యే నిధులను మాత్రం ఇవ్వకపోగా అప్పులు తీసుకుని పనులు చేయాలని సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగానే బాండ్ల ద్వారా రూ.495కోట్లు, రూపీ టర్మ్‌లోన్ ద్వారా రూ.2,500కోట్లు, సీఆర్ఎంపీ కోసం రూ.1,460కోట్లను బ్యాంకులోన్ ద్వారా సేకరించారు. మధ్యలో ఆగిపోయిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్లను పూర్తిచేయడానికి మరో రూ.337కోట్లు బ్యాంకు రుణం తీసుకున్నారు.