Authorization
Fri March 28, 2025 08:16:44 pm
- ఫిబ్రవరి కరెంట్ చార్జీలతో వినియోగదారుల బెంబేలు
- లోడ్‌కు అనుగుణంగా మీటర్ నమోదు లేదని వడ్డన
- డెవలప్మెంట్ పేమెంట్, సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో మోత
- రూ.200 బిల్లు వచ్చేవారికి ఏకంగా రూ.10వేలు చార్జి
- ఒక్క ఖమ్మం జిల్లా ప్రజలపైనే రూ.100 కోట్ల భారం
- సంస్థ నష్టాల పేరుతో ప్రభుత్వ కుటిలయత్నాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. సంస్థ రూ.10వేల కోట్ల నష్టాల్లో ఉందనే పేరుతో ప్రభుత్వం ఎత్తుగడలకు తెరతీసింది. దీనిలో భాగంగా త్వరలో విద్యుత్ వినియోగ టారిఫ్ చార్జీలు పెంచాలనే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా సంస్థకు రూ.6వేల కోట్లు వస్తాయట. మిగిలిన రూ.4వేల కోట్లను భర్తీ చేసుకునేందుకు వినియోగదారులపై వివిధ రకాల పేరుతో భారం మోపాలనే ప్రణాళికలో భాగంగా డెవలప్మెంట్ చార్జీలు (డీఈవీ. సీహెచ్‌జీ), సెక్యూర్టీ డిపాజిట్ ( ఎస్డీ ఏఎంటీ)లను ఫిబ్రవరి నెల బిల్లులో విధిస్తోంది. ఫలితంగా గతంలో రూ.400లోపు బిల్లు రానివారికి సైతం ఒక్కసారిగా రూ.10వేల వరకు బిల్లు రావడంతో వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. ఆ బిల్లులు పట్టుకుని కరెంట్ ఆప ˜ీసుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు లోడ్‌కు అనుగు ణంగా మీటర్ నమోదు లేదని సమాధానం ఇస్తున్నారు. ఈ ఒక్కసారికి బిల్లు వచ్చిన మొత్తం చెల్లిస్తే భవిష్యత్‌లో ఇలాంటి లోడ్ చార్జీలేవీ ఉండవని సూచిస్తున్నారు. బిల్లు తగ్గించడం వంటివేవీ తమ చేతులో లేదని, దరఖాస్తు చేస్తే రెండు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇస్తామని చెప్పి భారమైనా భరించాల్సిందేనని సెలవిస్తున్నారు. కేటగిరీలతో నిమిత్తం లేకుండా ఎస్డీ, డీఈవీ చార్జీలను మీటర్ ఉన్న వినియోగదారులందరికీ వర్తింపజేస్తు న్నారు. వినియోగించే ఎలక్ట్రికల్ వస్తువుల ఆధారంగా లోడ్చార్జీలను గతంలో నిర్దేశించారు. గతంలోనేలోడ్ చార్జీలు చెల్లించినవారు మినహా మిగిలిన వినియోగదారుల నుంచి ఎస్డీ, డీఈవీ పేమెంట్లను వసూలు చేస్తున్నారు.
ఒక్కసారిగా రూ.10వేల బిల్లు
ఖమ్మం అర్బన్ మండలం టేకులపల్లికి చెందిన చిన్నంశెట్టి సుబ్బారావు (యూఎస్సీ నెం: 10229634) కరెంట్ బిల్లులో లోడ్ 2 కిలోవాట్స్‌గా నిర్దేశించారు. డిసెంబర్ నెలలో రూ.178, జనవరిలో రూ.254 బిల్లు వచ్చింది. ఈ రెండు నెలల్లోనూ నెట్ అమౌంట్ కింద డీఈవీ చార్జి (6 కిలోవాట్స్) రూ.8,496, ఎస్డీ అమౌంట్ రూ.1,200 అని పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి నెల బిల్లులో ఏకంగా రూ.9,782 చార్జి విధించారు. ఈ బిల్లులో గతంలో నెట్ అమౌంట్ కింద వచ్చిన డీఈవీ, ఎస్డీ చార్జీలు ఈ సారి టోటల్ అమౌంట్లో కలిపివేశారు. బిల్లు చూసి సుబ్బారావు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. తొమ్మిదేండ్ల కిందట మీటర్ తీసుకున్న సుబ్బారావు తన గృహంలో మూడు ట్యూబ్‌లైట్లు, ఒక టీవీ, ఓ ఫ్రిడ్జ్, రెండు ఫ్యాన్లు, ఒక నీటి మోటార్ మాత్రమే వినియోగిస్తున్నామనీ, ఏసీల వంటివేవీ తమకు లేవని చెబుతున్నారు. ఆ బిల్లులు పట్టుకుని కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. 'రెక్కాడితే గానీ డొక్కాడని' తాము ఇంత బిల్లు ఎలా చెల్లించాలని వాపోతున్నారు. ఒక్క గదిలో ఉంటూ లైటు, ఫ్యాన్ మాత్రమే వాడే ఒంటరి మహిళకు సైతం రూ.6,000 చార్జి విధించారు. ఇలా ఈ నెల బిల్లులో ఎస్డీ, డీఈవీ చార్జీల భారం మోపడంపై వినియోగదారుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల వినియోగదారులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. కరెంట్ ఆఫీసుల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయం, చేతివృత్తులు ఇతరత్రా వారికి ఈ చేత సబ్సిడీలు ఇచ్చి ఆ చేత అంతకు రెట్టింపు లాక్కుటోందని వాపోతున్నారు.
ఈ లోడ్ల లెక్కేంటి..?
ఒక బల్బ్ 5 నుంచి 60 వాట్స్, సీలింగ్ ఫ్యాన్ 50-150, టీవీ 150- 250, సింగిల్ ఫేజ్ మోటార్ పంపు 375-1500, మిక్సీ 150-750, వాటర్ హీటర్ 550-1500, కంప్యూటర్ 100-250, ఏసీ- 1000- 3000 వాట్స్‌గా నిర్ణయించారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు ఇంట్లో నాలుగు బల్బులు, రెండు ఫ్యాన్లు, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ వినియోగిస్తే ఎలా లెక్కిస్తారో చూద్దాం. 4×9= 36, 2×125= 250, 1×250= 250, 1×200= 200 ఇలా మొత్తంగా 736 వాట్స్ వినియోగిస్తున్నట్టు లెక్కకడుతున్నారు. దీని ఆధారంగా కిలోవాట్స్ (కేడబ్ల్యూ) వారీగా లోడ్లను నిర్దేశిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం ఏడు కేటగిరీల కింద 6.22 లక్షల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో అత్యధికంగా కేటగిరీ 1 కింద 4,58,572 మంది ఉన్నారు. వీరిలో లోడ్‌కు అనుగుణంగా మీటర్లో నమోదు కాని వారందరికీ ఈ చార్జీలు విధించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈరకంగా ఒక్క ఖమ్మం జిల్లా వినియోగదారుల నుంచే రూ.100 కోట్ల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఒక్కసారి పే చేస్తే మళ్లీమళ్లీ కట్టాల్సిన పనిలేదు
డెవలప్మెంట్, ఎస్డీ చార్జీలు ఒకసారి చెల్లిస్తే మళ్లీ మళ్లీ చెల్లించాల్సిన పనిలేదు. ప్రతి నెలా కరెంట్ బిల్లులో ఇవి రావు. వినియోగించే లోడ్ ఆధారంగా ఈ చార్జీలు విధిస్తున్నాం. ఈ చార్జీల్లో ఎలాంటి సవరింపు ఉండదు. ఒకేసారి మొత్తం చెల్లించలేని స్థితిలో ఉన్నవారు స్థానికంగా ఉన్న ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకుంటే రెండు, మూడు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇస్తారు. అంతకుమించి ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవు.
- రమేష్, సూపరింటెండెంట్ ఇంజినీర్, ఖమ్మం
దొంగచాటుగా భారం
ప్రభుత్వం ప్రత్యక్షంగా చార్జీలు పెంచితే ఆందోళనలు చేపడతారనే యోచనతో ఇలా దొడ్డిదారిలో దొంగచాటుగా భారం మోపుతోంది. త్వరలో టారిఫ్‌లలో మార్పులు చేసి భారం మోపాలనే యోచనలో ఉంది. లోడ్, సర్వీసు, డెవలప్మెంట్, సెక్యూరిటీ డిపాజిట్లు.. ఇలా రకరకాల పేర్లు చెప్పి ప్రజలపై విద్యుత్ చార్జీల భారం వేస్తోంది. కనీసం మీటర్లు చెడిపోయినా కొత్త మీటర్లు ఇవ్వకుండా నెలల తరబడి జాప్యం చేసి అప్పటివరకు అత్యధికంగా వచ్చిన బిల్లును పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా ప్రతినెలా బిల్లులు విధిస్తోంది. ఇలా రకరకాలుగా ప్రజలపై భారం వేస్తూ ఈ చేతితో ఉచిత, సబ్సిడీలు ఇచ్చి ఆ చేతితో లాక్కుంటోంది.
- నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి