Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కుల కోసం ఉద్యమం తప్పదు : టీఎంఎస్‌ఆర్‌యూ మహాసభలో సునిల్‌కుమార్
- రాష్ట్ర అధ్యక్షుడిగా సీహెచ్ భానుకిరణ్, ప్రధాన కార్యదర్శిగా ఐ రాజుభట్ ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదనీ, పోరాడి సాధించుకున్న హక్కుల అమలు కోసం ఉద్యమించక తప్పదని ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంట్టీవ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఆర్ఏఐ) కార్యదర్శి కె. సునిల్ కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజుల పాటు కొనసాగిన తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంట్టీవ్స్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్‌యూ) నాలుగో మహాసభ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఆదివారం మహాసభను ఉద్దేశించి సునిల్ కుమార్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 28,29న జరిగే దేశవ్యాప్త సమ్మెలో మెడికల్ సేల్స్ ఉద్యోగులు బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజారోగ్యాన్ని, ప్రభుత్వ రంగాన్ని కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నదని తెలిపారు. దీని వల్ల ఉద్యోగ భద్రతకు విఘాతం ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను ఆధునీకరిచటం, ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని తెలిపారు. ఈ విషయం కోవిడ్ కాలంలో అందరికీ అర్థమైందని గుర్తుచేశారు.కోవిడ్‌ను కట్టడి చేయటంలో మోడీ సర్కార్ విఫలమైందనీ, దీంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రాణభయంతో ఆస్పత్రి పాలైనవారి దగ్గర కార్పొరేట్ ఆస్పత్రులు లక్షలాది రూపాయలు గుంజాయని ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో కుటుంబాలు ఆర్థికంగా దివాళా తీశాయని చెప్పారు. వైద్య పరీక్షలు చేయటానికి కూడా తగినంత సామాగ్రి ప్రభుత్వాస్పత్రుల్లో లేకపోవటంతో ప్రతి చిన్న వైద్య పరీక్షకు కూడా ప్రయివేట్ లాబొరేటరీలను ఆశ్రయించాల్సి రావటమనేది ప్రభుత్వ ప్రజారోగ్య విధాన వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్ మాట్లాడుతూ అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదనీ, ఇది కచ్చితంగా కార్మిక వ్యతిరేక ప్రభుత్వమేనని విమర్శించారు.29 కార్మిక చట్టాలను తొలగించి వాటి స్థానంలో నాలుగు లేబర్కోడ్లను ప్రవేశ పెట్టటం కార్మిక ప్రయోజనాల కోసమా? కార్పొరేట్ల ప్రయోజనాల కోసమా? అన్న విషయాన్ని బీజేపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. నాటి కార్మిక చట్టాల్లో లోపాలు, పరిమితులు ఉన్నప్పటికీ.. కార్మికులను యజమానులు నిరాఘాటంగా దోపిడి చేయకుండా నిలవరించాయని గుర్తుచేశారు.మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమిస్తేనే దేశ భవిష్యత్ నిలబడుతున్నదని చెప్పారు. ఆంద్రప్రదేశ్ ఎంఎస్ఆర్యూ అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంట్టీవ్స్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్‌యూ) సంయుక్త ప్రధాన కార్యదర్శి ఎ నాగేశ్వర్రావు తదితరులు మాట్లాడారు.
నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక
తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటిటీవ్స్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్‌యూ) నాలుగో రాష్ట్ర మహాసభలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సీహెచ్ భానుకిరణ్, ప్రధాన కార్యదర్శిగా ఐ రాజుభట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపఅధ్యక్షులుగా జి విద్యాసాగర్, సంయుక్త కార్యదర్శి ఎ నాగేశ్వరరావు, కోశాదికారి కె దుర్గాప్రసాదరావు, కార్యదర్శులుగా సిహెచ్ శ్రీధర్, దొంతుల శ్రీనివాస్, కె ఐలయ్య, సయ్యద్ సిద్దికితో పాటు మరో 11 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.