Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన
- పోలీసులు హామీతో విరమణ
నవతెలంగాణ-భిక్కనూర్
పొలం గట్ల హద్దురాళ్ల గొడవ విషయంలో పోలీసులు స్టేషన్‌కు పిలవడంతో అవమానంగా భావించిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆత్మహత్యకు కారణం భూతగాదాలేనని.. పోలీసులు పిలవడంతో అవమానానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో జరిగింది. అదే గ్రామానికి చెందిన రమేష్‌కు చెందిన వ్యవసాయ పొలానికి.. సిద్ధరాములు(49) భూమికి మధ్య హద్దురాళ్లను రాములు తొలగించాడని ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్లో రమేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు స్టేషన్లో హాజరు కావాలని సిద్ధరాములుకు పలుమార్లు ఫోన్ చేశారు. దాన్ని అవమానంగా భావించిన సిద్ధరాములు గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో ఉరేసుకున్నాడు. సిద్ధరాములు ఆత్మ హత్యకు కారణమైన రమేష్‌ను శవం వద్దకు తీసుకురావాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. అప్పటివరకు శవాన్ని కిందకు దించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న భిక్కనూర్, బీబీ పేట్, రాజంపేట్ ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి శాంతింపజేశారు. అయినా వారు వినకపోవడంతో గ్రామ ప్రజాప్రతినిధులు, కులస్తులు, బాధిత కుటుంబ సభ్యులతో సీఐ తిరుపయ్య చర్చలు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని హామీనిచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. అనంతరం శవాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.